నాలో చిన్నగా రాపిడి మొదలైంది. అది దేన్ని పుట్టిస్తుందో తెలీదు. ఈ రాపిడిలో నాకు తెలిసే విషయాలు చాలా ఉన్నాయని మాత్రం అర్థమవుతోంది. నన్ను ఒక్కసారిగా ఈ లోకం నుండీ బదిలీ చేస్తాయి ఆ ఆలోచనలు. ఎక్కడికి వెళ్తానో తెలియదు, తిరిగి రావడం తెలుస్తుంది.
ఇదంతా
ఎందుకు జరుగుతుంది. నేను కొత్తగా పరిచయం చేసుకున్న రచయిత చలమే
దీనికంతటికీ కారణమని తెలుస్తుంది నాకు. మొదట్లో రచయితగానే పరిచయం
అయ్యాడు, క్రమంగా అతని రచనలు నాకేమిస్తున్నాయీ, అని ఆలోచించి
తేల్చుకునేలోపే మెల్లగా సందుచేసుకుని నాలో దూరిపోయాడు. ఎవరతను, ఎందుకు
పరిచయం అయ్యాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు. ఎప్పుడూ మామధ్య సాగేది ప్రశ్నల
వర్షమే. ఏదో రమ్మన్నాడు కదాని కూడా వెళ్ళడం, అతను పుట్టించే ప్రశ్నలూ
సందేహాలతో బిక్కమొహం వేసుకుని అంత అయోమయంతోనూ వెనుతిరగటం, ఆ సంభాషణలన్నీ
నేను అనంతమైన అజ్ఞానంలో కూరుకుపోయున్నానని పదేపదే గుర్తుచేయడం... ఇదే
సాగుతుంది కొంత కాలంగా.
మొదట
సంభాషణ ప్రారంభిస్తాడిలా.. "అసలు ఎవరు నువ్వు, ఎందుకు జీవిస్తున్నావు?
నేనూ, నాదీ అని కాకుండా నీలోని కోరికా, వ్యసనం, ఆనందం, చింతా అన్నీ వదిలి
దీనికి మించి నీలో దాగున్న చైతన్యం గురించి ఎప్పుడన్నా ఆలోచించావా? ఏం
చేస్తావు, జీవించి ఓ వందేళ్ళు బతుకుతావు. అసలు బతకడం ఎందుకు? బతికి ఏం
చెయ్యాలి? ఆలోచించు, ఏం చేయాలనుకుంటున్నావో" అంటాడు. మచ్చుకి అతని గురించి
మొన్న జరిగిన సంగతోటి చెపుతాను. నేను బస్సులో వెళుతున్నాను. నీరసంగా ఉండి
పడుకోవాలనుకుంటున్నాను. ఇంతలో అతడు నన్ను పిలుచుకెళ్ళాడు తన వెంట. "ఏమిటి
నిద్రపోతున్నావా?" అవునని తలూపాను. "ఎందుకు నిద్రపోతున్నావు? అసలు
నీవున్నది పూర్తి నిదురలోనే కదా మళ్లీ నిదురపోవడం దేనికి? ఎప్పుడు ఆ చీకటి
నుండీ నిద్దుర నుండీ మేల్కొంటావో అని నేనిక్కడ ఎదురు చూస్తున్నాను.
నీలోని దాగున్న చైతన్యం గురించి తెలుసుకుంటావని అనుకుంటుంటే నీవేమో
అజ్ఞానాన్నే లోకంగా భావించి నిద్రపోతున్నావు. చూడు నీ శరీరంలో పుట్టే
ఆకలిని గుర్తించినట్టుగానే నీలో పురుడుపోసుకుంటున్న ఆలోచనల్నీ అనుమానాల్ని
ఎందుకు గుర్తించవు? వాటి గురించి ఎందుకు ఆలోచించవు. ఏమిటి నీ బాధ, ఆ
లోకంలోని సుఖాలకు దూరమైపోతావనేనా? అదే అయివుంటుంది. మరో కారణమేమీ ఉన్నట్టు
నాకు తోచడం లేదు. సరేలే..."
ఇలా ప్రశ్నల
శస్త్రాలు నాపై సంధించి మాత్రమే ఊరుకోడు. మళ్లీ మేం కలుసుకున్నప్పుడు, వాటి
గురించి ఏం ఆలోచించావూ అంటూ నాకు గుర్తు చేస్తూ ఉంటాడు. గొప్పరచయితఅని
అతని రచనలు చదవడం మొదలు పెట్టాను. కానీ చదువుతూ చదువుతూ - ఎందుకివన్నీ,
అతను ఎక్కడ పుడితే నాకెందుకు అతని పుట్టు పూర్వోత్తరాలు నాకు అంత అవసరమా?
తెలుసుకుని నేనేం చేయాలి? అసలు అలా ప్రపంచాన్ని ఎదిరించి, సమాజమంతటినీ
గేలిచేసిన వాడు ఏం తెలుసుకున్నాడని ఎక్కడికో బైరాగిలా వెళ్ళిపోయాడు? అతనికి
తెలిసినదేమిటో నేను తెలుసుకోలేనా?... ఇలా నెమ్మది నెమ్మదిగా నన్ను తనలో
కలిపేసుకుంటాడు. ఇలాంటి అనుమానాలను నాలోనూ సృష్టించి మాయం అయిపోతూ ఉంటాడు.
నిజానికి
నాకేదో తెలిసిందని అనుకోను. అతని గురించి తెలుసుకోవలసింది చాలా ఉంది. అతను
ఈ విశాల సృష్టిలో దాగున్న మర్మాన్ని బట్టబయలు చేయడానికి భూమి మీదకు వచ్చిన
వాడు. అందుకోసం ఎన్నో విషయాలను తెలుసుకున్నాడు. అన్నిటితోనూ సమన్వయం
కుదుర్చుకున్నాడు. ప్రతి జీవినీ పరిచయం చేసుకున్నాడు. ప్రకృతిలో
కలిసిపోయాడు. గాలీ, ధూళి, నీరు అన్నీ తాకి పరవశించాడు. ఇంతా చేసి అన్నిటికీ
చేరువయ్యాడు కానీ, అతి తెలివిగల ఈ మూర్ఖపు మనుషులకే అర్థం కాలేకపోయాడు.
జీవాన్ని గుర్తించని వీళ్ళు నిర్జీవం అయ్యాకా కీర్తించడం శిలువు
వేసింతర్వాత చేతులెత్తి మొక్కడమే కదా. ఏదన్నా విషయాన్ని చర్చించే ముందు
అందులోని అసలు విషయం కన్నా దానికిమనం ఆపాదించే శీలమూ అశ్లీలాలే ముందుగా
మన చర్చకు వచ్చేది. అదే చర్చిస్తాం మనం. లాభాన్ని, నష్టాన్ని బేరీజు
వేసుకుని అటు వెళ్తాం. ఎంత లాభం కిడుతుందో లెక్క తేలాకే ముందుకు పోతాం.
నష్టం వస్తే వెళ్ళనే వెళ్ళంగా. మనిషి పోయాక విగ్రహాలు పెట్టి పాలాభిషేకాలు
చేస్తాం.
ఇక అతడి గురించి ఏదో
చెప్పబోతుంటే మొన్న ఒకావిడ నాతో "ఆయన బూతు రచయిత కదమ్మా... మాఇంట్లో
చదవనిచ్చేవారు కాదు. అయినా దొంగతనంగా చదివేవాళ్ళం" అంది. అంటే ఆమెకు అతడు
ఏం రాసాడో అన్నదానికంటే అందులో ఎంత శాతం అశ్లీలాన్ని చొప్పించాడో
తెలుసుకోవాలనే కుతూహలమే ఎక్కువగా ఉందనిపించి ఊరుకున్నాను. అతడు ఆడదానిలో
అందరికీ అర్థం కాని ఏదో కోణాన్ని చూసాడనిపిస్తుంది నాకు. ఆమెకు హృదయంతో
దగ్గర కావడానికి ప్రయత్నించాడు. సంఘం అనే ఉచ్చులో పడకుండా, కులం
అడ్డుగోడల్ని కూల్చేసి బతికినవాడు చలం. అందుకే సంఘం నుండీ వెలివేయబడ్డాడు.
అతడి గురించి తెలుసుకున్నవాళ్ళకు తెలుసుకున్నంత.
నీవు నమ్మిన దైవం గురించి నీలో ఇటువంటి ఆలోచన ఎప్పుడన్నా అంకురించిందా?-----
"వేద పురుషుడివి నీకు తెలియనిదేముంది!" అని చల్లగా తప్పుకుంటారు. ప్రతి వాడికీ, ప్రతి రుషికీ, కోతికీ, బైరాగికీ రాముడు లోకువ. ప్రతివాడూ, యోగమూ, ధర్మమూ, వైరాగ్యమూ, మాట్లాడేవాడే, బోధించేవాడే. పైగా ధర్మాలు వెలిగే యుగంలో స్వయంగా విష్ణులో ముప్పాతిక అంశతో పుట్టాట్ట శ్రీరాముడు. ఆయనకి ఈ భోధనలు అవసరమేమిటో! శ్రీరాముడికీ, ధర్మరాజుకీ ఎవరు భోధింనా, చచ్చేదాకా జ్ఞానం వచ్చినట్టు లేదు. అన్ని పాపాలు చేసిన అల్లరి కృష్ణునికి చెప్పడానికి ఎవరికీ గుండెలు లేవు. పైగా అతడే ప్రపంచానికి భగవద్గీత భోధించాడు. అతను రసికాంతుడు, ప్రేమలో, మోహంలో, ఛాతుర్యం, తీవ్రత, లీల, శృంగారం, - ఎంత వుందో అంతా చిరకాలం నించి కవులు తమ భావ వీధుల్లో అందుకోగలిగిందంతా శ్రీకృష్ణుడి మీద వర్షించారు. అట్లాంటి వ్యభిచారి చేత (అస్కలిత బ్రహ్మచారి చేత ) ఉపనిషత్సారం అనుకుని సన్యాసులు పూజించే భగవద్గీతను చెప్పించడంలో ఉన్న రహస్యాన్ని, సత్యాన్ని ఎవరన్నా గమనించారా?
బాల్యం వైపు జాలిగా చూసావా?-----
పిల్లలు - ఉత్తనెత్తురు, ఎదిగే ఎముకలు, ఆత్రుతతో విశ్వాసంతో నిండిన చూపులు, ముద్దు మాటలు, అర్థంలేని అల్లరి, నిష్కపటమైన మనసులూ, - చవక, అతిచవక - పిల్ల చస్తే పిల్లను కనడం సులభం. పురుగుల మల్లేలోకమంతా పిల్లలు - ఎన్ని కోట్లు - ఏమైతేనేం - బాధ ఏమిటో, ఎందుకు కలుగుతుందో తెలుసుకోలేని పాపలు. బలపం పట్టుకుని, తలవంచుకుని ఐదు గంటలు..... ఒక వంకర గీత మీద అట్లా రుద్దుతూ ఒక్క అక్షరాలేమిటి, సమస్తమున్నూ, టీచరు ప్రశ్నలూ, ఈ దరిద్రగొట్టు ఇనస్పెక్టర్ల తనిఖీలూ, అంత నవ్వు రాకపోతే, ఈ కోపమే దహించకపోతే ఏడుద్దును.
నీలో అహంకారానికి చోటీయకు----
ఎరుకపడని దేవుడిలో భక్తి లేకపోయినా, మానవుడిలో, ప్రాణుల్లో, సృష్టిలో ఉండే దేవత్వం కనిపెట్టగలిగి, దాని ముందు తలవొంచ లేకపోతే పోనీ, రాత్రి అగాధాకాశాల ముందు, ప్రజ్వలమైన సూర్యాస్తమయాల ముందు, హృదయాన్ని అద్భుత పడచేసే కళ ముందు తాను ఏమీకాననే వినమ్రత భావంతో తలవొంచలేకపోతే, మానవుడిలో బోలు అహంకారమూ, అహంకారపు కర్కశత్వమూ, అతన్నే కరుచుకు తింటాయి.
అతడు
చెప్పి చర్చించిన చాలా విషయాలను నేను విస్మరించి ఉండవచ్చు, ఎందుకంటే
నాకు అవిపూర్తిగాఅనుభవంలోకి రానివి అవటం వల్ల కావచ్చు. అతడు చెప్పే విషయం
పక్కకుపోయి మరేదో బోధపడుతూ ఉంటుంది చాలా సార్లు. నేను ఇది రాస్తున్నానే
కానీ, కొంత కాలం తరువాత ఇతగాడి పుస్తకాలు తిరగేస్తున్నప్పుడు అయ్యో ఇతడు
చెప్పిన సంగతులన్నీ పక్కన పెట్టేసి మరేదో రాసేశానే అని నాలిక కరుచుకునే
సంధర్భం రాకపోదు. ఎందుకంటే అతను అన్ని స్వరూపాలను తన రచనలో, వ్యక్తీకరణలో
చూపించాడు. ఈ సమస్యలు, సందేశాలు, స్పందనలూ మనమీదకు ఎక్కుపెట్టి
వెళ్ళిపోయాడు. అందుకే చలం చదువుకున్నవాళ్ళకు చదువుకున్నంత. అతని రాతలు ఓ
గ్రంథాలయం. అందులో ప్రస్తావించని విషయం లేదు. పరిచయం కాని సంగతిలేదు. అతని
వెలుగులు ఇంకా ఈ భూమ్మీద ప్రసరిస్తూనే ఉన్నాయి. అవి ఈలోకంలోని
అజ్ఞానాన్నీ చీకటిని తీసేసి మనలో వెలుగుల్ని నింపాలని ప్రయత్నిస్తూనే
ఉన్నాయి. మన మత గ్రంథాలు మనకు నేర్పే భక్తి, విశ్వాలతో పాటు మనలో దాగున్న
మరో కోణాన్ని మనలో చైతన్యాన్ని అద్దంపట్టి చూపిస్తాయా రాతలు.
* * *
చలం ఇంటర్వ్యూ---
No comments:
Post a Comment