Thursday, 14 May 2020

రాజీ.. జీవితంలో..




ప్రతి మనిషి తన జీవితంలో బాగా ప్రేమించిన మనిషి గురించో లేక ధ్వేషించిన వాళ్ళ గురించో మనసు పొరల్లో తేలుతూనే ఉంటుంది. ఇందులో కొన్నిఎంత వద్దనుకున్నా గుర్తుకువస్తూనే ఉంటాయి. మరికొన్ని ఆ జ్ఞాపకాల రొద మొదలైనప్పుడు తెరలు తెరలుగా గతం వైపుకు మన ప్రమేయం లేకుండానే తీసుకువెళతాయి. ఇలా ఆలోచించిన ప్రతిసారి నా మెదడులో ఓ ఆలోచనగా పుట్టి దానికి రూపాన్ని ఇస్తే అది మా రాజీ పిన్నే అవుతుంది. ఇంత బలంగా ఆమె నాలో నిలిచిపోడానికి కారణం బాల్యం అద్దిన రంగుల తెరమీద రాజీ పిన్ని జీవితాన్ని దగ్గరగా చూడగలగడమేనేమో. కాలం కొన్ని కట్టుబాట్లకు కట్టేస్తే ఆ గుంజ చుట్టూతా తిరక్కుండా.. పలుపుతాడును తెంపుకు పారిపోయిన లేగ దూడలా అనిపిస్తుంది రాజీ పిన్ని. తను అలా మనసులో మెదిలిన ప్రతిసారీ తనకూ, నాకూ జీవితం ఒకలానే రాత రాయాలనుకోవడమే నన్ను పిన్నికి దగ్గరచేసిందా అనే అనుమానం కలుగుతుంది. అంతేకాకుండా రూపంలో కూడా మా ఇద్దరికీ పోలికలు ఉండటంతో నేను ఆమెను ఇంత దగ్గరగా తెచ్చుకోగలుగుతున్నానేమో తెలీదు.


నాలుగురోజుల క్రితం తననుంచీ వచ్చిన ఆ ఫోన్ కాల్ మళ్ళీ నన్ను రాజీపిన్ని చూట్టూ నా బాల్యాన్ని వెతుక్కునే ఆలోచనలో పడేసింది. “ ఏలా ఉన్నావే.. ఎక్కడ ఉంటున్నావ్”. ఇలాంటి కుశల ప్రశ్నలు నన్ను అడిగిన తరవాత తన గురించి మాత్రం రెండే మాటలు చెప్పింది. “జీవితంలో ఓడిపోయానే.. నాకు ఊహ తెలిసిననాటి నుంచీ కష్టపడుతూనే ఉన్నాను. ఈరోజు నా చివరిరోజులు గడిచేందుకు నాకంటూ భరోసా లేకుండా పోయింది.”. గొంతు జీరగా ఉంది. మనసులో ఎంతో బాధ లేకపోతే తను అలా మాట్లాడదని నాకు తెలుసు. “సరే పిన్ని.. నువ్వేం కంగారు పడకు... వీలైతే ఈసారి వచ్చినపుడు నిన్ను తప్పకుండా కలుస్తాను”.. కాస్త అవీ ఇవీ మాట్లాడి ఫోన్ పెట్టేసాను.


పిన్నిని చూసి దాదాపు ఎనిమిదేళ్ళు అవుతుంది. కాకినాడలో రెండు నెలల క్రితం వాచ్ షాపుకి వెళ్ళినపుడు రాజీపిన్ని అల్లుడిని చూసాను. “ఏలా ఉన్నారంటూ” అతనే చొరవగా నన్ను పలకరించాడు. మొదట గుర్తుపట్టలేదు. నెమ్మదిగా మాటల్లో రాజీపిన్ని గురించి చెప్పుకొచ్చాడు. ఆరోగ్యం ఏం బావుండటం లేదని.. కుట్టుపని ఇప్పుడు చేయలేకపోతుందని. వీలైతే వచ్చి కలవమన్నాడు. నేను వచ్చిన కారణం వేరుకావడంతో ఆరోజు పిన్నిని కలవకుండానే తిరిగి ఊరికి వచ్చేసాను. అతనికి మాత్రం రాజీపిన్నికి నా నంబర్ ఇచ్చి ఫోన్ చేయించమని చెప్పాను. ఈరోజు పిన్నితో మాట్లాడితే కళ్ళ ముందు మళ్ళీ నాకు తెలిసిన చిన్ననాటి రాజీ రూపం కదిలింది. వెలుతురంటూ చొరబడని, ఫేనుగాలి తప్ప మరో మార్గంలేని ఈ గదిలో.., సమయంతో పనిలేని నా మెదడు చేస్తున్న ఆలోచనల రొదకు ఆ ఉదయం రాజీపిన్ని మాటల వెనుక కన్నీటి నిట్టూర్పుల కథను వెతుక్కుంటూ వెళుతున్నాను.


నా మనసు పొరల్లో ఆమె రూపం కాలానికి తగ్గట్టు మార్పులు సంతరించుకోలేదు. ఇంకా ఆ ముఖానికే అందాన్ని తెచ్చే తనవైన పెద్ద కళ్ళతో రాజీ పిన్నికే సొంతమైన సిరినవ్వుతో నా ఊహలో నిలిచిపోయింది. గిరజాల జుట్టు, నీలి కళ్ళు, శంఖం లాంటి మెడ.. ఒళ్ళంతా నున్నటి నూగు, పెద్ద కళ్ళతో అచ్చం ఒకప్పటి సినిమా హిరోయిన్ లా ఉంటుంది రాజీ. మనిషి చలాకీగా.. మెరటుగా కనిపిస్తుంది కానీ మనసు చాలా సున్నితం. చిన్నాళ్ళకు పెద్దాళ్ళకూ అందరికీ తను రాజీనే. రాజీపిన్నికి నాకు వయసులో మరీ అంత వ్యత్యాసం ఉండదు.. మహా అయితే ఓ పదేళ్ళు పెద్దదేమో.. ఇప్పటి వరకూ నేను చూసిన అందగత్తెలందరి కన్నా ముందువరసలో ఉంటుంది రాజీ. నా బాల్యానికి తన యవ్వనానికి లంకవేసి ఎన్నో ఆటలు ఆడుకున్నాం.


తను లంగా ఓణీలు కట్టే నాటికి నేనింకా గౌనుల్లో చిన్నపిల్లనే.. ఒకసారి కోతులు వచ్చి పెరట్లో చెట్లమీద చేరి కాయలన్నీ తెంపి అల్లరి చేస్తున్నాయి. రాజీ కూడా నేనూ వాటిని అదిలించాలని వెళ్ళాను. నారింజ చెట్టు మీద నుంచీ ఓ పెద్ద కోతి నా మీదకు ఉరికింది. భయంతో గట్టిగా కేకపెట్టి రాజీ చంక ఎక్కేసాను. నా భయాన్ని చూసి విరగబడి నవ్వింది.., అచ్చం ఇప్పటి నా నవ్వులా.. , ప్రతివారం ఇంటిపని అయిపోయాకా ఇద్దరం కుట్టిన పార్టీ జండాలను అప్పగించడానికి నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళం. దారంతా బోలెడు కబుర్లు చెప్పుకునేవాళ్ళం. తిరిగి వచ్చేటప్పుడు బెల్లం జిలేబీ కొనిపెట్టేది. అంతదూరం నడకలో ఉన్న అలసటంతా జిలేబీని చూసేకా పోయేది నాకు. ఓరకంగా ఆ జీలేబీ కోసమే తనతో వెళ్ళేదాన్నేమో..


ఓసారి కటార్ నగర్ దాటి, తిలక్ రోడ్డులోకి వెళ్ళాకా ఇద్దరు అబ్బాయిలు మా వెనకే వస్తున్నారు. రాజీ వాళ్ళను గమనించినా గమనించనట్టు నాతో మాట్లాడుతుంది. వెనక వాళ్ళు నన్ను పిలుస్తున్నారు. నేను తలతిప్పి చూస్తే సైకిల్ ఆపేసి మాట్లాడుకుంటున్నారు. సగం దూరం అలాగే వచ్చేసాం. ఇద్దరిలో ఒకడు మాకన్నా ముందుకి వచ్చి సైకిల్ ఆపాడు. రాజీ కళ్ళు పెద్దవి చేసింది. అప్పటివరకూ నాతో నవ్వుతూ మాట్లాడినదల్లా.., ముఖంలో ఎంతో కోపాన్ని తెచ్చి పెట్టుకుంది. రాజీ వాడికి దగ్గరగా వేళ్ళి సైకిల్ హేండిల్ పట్టుకుని నోటికొచ్చినన్ని తిట్లూ తిట్టేసింది. నా చెయ్యి గట్టిగా పట్టుకుంది పరుగులాంటి నడకతో అక్కడి నుంచీ వచ్చేసాం. నేను ఇంకా చిన్న పిల్లనే కావడంతో ఇదేదో ఆటలా అనిపించింది నాకు.


మా ఇద్దరికీ ఉన్న వయసు వ్యత్యాసం తనను నా నుంచీ దూరం చేసింది. రాజీ మీదకు ఒక్కసారిగా వచ్చిపడిన పెళ్ళి పిల్లలు బాధ్యతల మధ్య జీవితంతో పోరాడుతూ నాకు దూరంగా జరిగిపోయింది. వాటిలో పడి నాతో కలిసి ఆడిన ఆటలన్నీ మరిచిపోయింది. కానీ ఎప్పుడన్నా కనిపిస్తే తను ఏది వండుకుంటే ఆ కూరే వేసి ఆప్యాయంగా అన్నం పెట్టేది. అమ్మ తర్వాత అమ్మలా. ఎప్పుడూ వరసకదా అని పిన్ని అని పిలవలేదు. కాస్త పెద్దయ్యాకా రాజీపక్కన పిన్ని అని తగిలించాను గానీ తను ఉత్తరాజీగానే దగ్గరగా అనిపిస్తుంది.


రాజీ చిన్నతనం నుంచే కష్టపడటం అలవాటు చేసుకుంది. తన ఈడువాళ్ళు రెండు జడలేసుకుని, తలనిండా పూలు సింగారించి, పావడా కట్టుకుని ఆటలాడుకుంటూంటే... రాజీపిన్ని కుట్టు పనిలో మునిగిపోయేది.. మా తాత సంపాదించి తెచ్చేది తన తాగుడికే సరిపోయేది కాదు. ఇక కుటుంబ భారాన్ని ఉన్న ఇద్దరు ఆడపిల్లలు పంచుకున్నారు. పార్టీ జండాలు, లంగాలు, రేడీమేడ్ గౌనులు కుట్టి షాపులకి వేసే పని. రోజంతా కుడితే వందరూపాయలు వచ్చేవి. అవే ఐదుగురు పెద్దవాళ్ళకీ సరిపెట్టాలి. మా అమ్మ పెళ్ళి వయసు దాటకుండానే పెళ్ళి చేసుకుని ఇల్లు దాటి వచ్చేసింది కానీ.. రాజీ పిన్నికి చాకిరీ తప్పింది కాదు. తన ఈడువాళ్ళకు పెళ్లిళ్ళయ్యి అత్తారిళ్ళకు వెళిపోతున్నా.., అక్కకు బిడ్డలు పుట్టేసినా తనింకా ఇంటి భారాన్ని మోస్తూనే ఉండిపోయింది. ఎన్ని సంబంధాలు వచ్చినా కట్నాలు ఇచ్చుకోలేమని.., కూతురికి పెళ్ళి చేసేస్తే ఉన్న సంపాదన పోతుందని వచ్చిన సంబంధాలను తాతే వెనక్కి పంపేస్తున్నాడని తెలిసినా.., రాజీపిన్ని మౌనంగానే ఉండిపోయింది.


ఓ సాయంత్రం వేళ అమ్మమ్మతో చిన్న తగాదా పెట్టుకుని పక్కింటికి వెళ్ళిన రాజీ తన జీవితం గురించి మొదటిసారి ఆలోచించుకుంది. వారం క్రితం రెండో పెళ్ళి చేసుకుంటానని రాయబారం పంపిన రంగనాథ్ ను పెళ్ళాడాలని తీర్మానించుకుంది. అనుకున్నట్టుగానే ఇద్దరూ గుళ్ళో పెళ్ళి చేసుకుని ఇంటికి వచ్చారు. ఈ పెళ్ళి అమ్మమ్మతో సహా ఎవరికీ నచ్చలేదు తల్లి కనుక అమ్మమ్మ బిడ్డ సుఖంగా ఉండాలని కోరుకుంది కానీ తాత పట్టుదలతో జరగాల్సిన ముచ్చట్లేం జరగలేదు.


రాజీ పెళ్ళయి నాలుగు నెలలు.. తను కొత్తకాపురానికి కావలసినవన్నీ అమర్చి మంచి ముహుర్తం చూసి అత్తారింటికి పంపేంత శ్రద్ధ ఆ ఇంట్లో ఎవరికీ లేదు. అందుకేనేమో తనే ఈ నాలుగు నెల్లో నాలుగైదుసార్లు అక్కడికి వెళ్ళి వచ్చింది. చిన్నాన్న తననుకున్నంత మంచోడు కాదని నెమ్మదిగా తెలుసుకుంది. ఇదంతా తనకు తెలిసేలోపు చిన్న చెల్లి వచ్చేసింది నేను ఆడుకోడానికి. సంవత్సరన్నరలో పదిమార్లు గిల్లికజ్జాలు ముదిరి చిన్న కొట్లాటల వరకూ చేరాయి. తను అత్తింటికి, పుట్టింటికీ తిరగటం మొదట్లో కొత్తనిపించినా నెమ్మదిగా “ఆ... ఎన్నిరోజులుంటుదిలే అక్కడ.. మళ్ళీ రెండురోజుల్లో వచ్చేస్తుందిగా అనే సులువైన అభిప్రాయం ఏర్పడిపోయింది మా అందరికి.


నాలుగేళ్లకు ముగ్గురు ఆడబిడ్డలకు తల్లయింది. ముగ్గురూ ఆడపిల్లలే పుట్టారని, వంశాన్ని కాపాడే కొడుకు పుట్టనందుకు రోజుకో వంకతో రాజీని కొట్టి, అందినచోటల్లా కొరికి ఒళ్ళు గుల్లచేసి పంపేవాడు చిన్నాన్న. ఎందరు చెప్పినా తగాదాలు ముదిరేవేగానీ.. సర్దుకునేవేకాదు. ఇదంతా తనకూ త్వరగానే అలవాటైపోయిందో లేదా అలవాటు చేసుకుందో తెలీదుకానీ.. మరీ బెంగలో కనిపించేది కాదు రాజీ.


తాగుడు, జూదానికి బానిసై ఉన్నదంతా పోగొట్టుకున్న చిన్నాన్న వ్యాపారం మొత్తం దివాళాతీసింది. భార్య,ముగ్గురు పిల్లలను పోషించే బాధ్యత నెత్తిన వేసుకునే ధైర్యం చాలక ఎవరికీ చెప్పకుండా ఊరు వదిలి పారిపోయాడు. చిన్నాన్న వస్తాడని ఎదురుచూసి రాజీపిన్ని ముగ్గురు బిడ్డలతో చిన్న ఇంట్లో మిగిలిపోయింది. కుటుంబం గడవడానికి మళ్ళీ కుట్టుమిషనే ఆధారం అయింది. భర్త ఎక్కడో ఉన్నాడని కబురందిన ప్రతిసారి నన్ను వెంటబెట్టుకుని వెళ్లి వెతికి వచ్చేది. తీరా చిన్నన్న కాదని తెలిసి కన్నీళ్ళు పవిట చెంగుతో అద్దుకుంటూ.. రేపు కుట్టి ఇవ్వాల్సిన బట్టలు ముందేసుకుని పనిలో పడిపోయేది. కొన్నాళ్ళకు చిన్నాన్న గుండెపోటుతో చనిపోయాడనే వార్త చాలా ఆలస్యంగా తెలిసింది. ఈ వార్త అందరినీ బాధించినా పిన్నిలో ఏ మార్పునీ తీసుకురాలేకపోయింది. అప్పటికే చిన్నాన్న లేకుండా కుటుంబాన్ని పోషిస్తూ.. ముగ్గురు బిడ్డల్ని సాకుతూ జీవితాంతం అలానే ఉండిపోవాలని నిర్ణయం తీసుకుంది. కనుక అతను ఇకలేడన్న వార్త రాజీని మరీ బాధించలేదు.


ఒంటరిగా భర్త సాయం లేకుండా ముగ్గురు బిడ్డలతో నెట్టుకొస్తున్న రాజీ మీద జాలి చూపించేవాళ్ళు ఎక్కువైపోయారు. చుట్టాల్లోనూ, తెలిసివవాళ్లలోనూ పిన్ని అందానికి మనసు పారేసుకుని పెళ్లయిందని వెనక్కు తగ్గిన వారంతా రాజీని పెళ్లిచేసుకుంటామని అమ్మమ్మకి రాయబారాలు పంపేవారు. కూతురు జీవితం బాగైపోతుందని, ఆశపడే ప్రతి తల్లిలాగే ఆలోచించే అమ్మమ్మ వాళ్ళను ఆదరించేది. రాజీకి జీవితం మీద ఎక్కడలేని ఆశనూ కల్పించిన వాళ్లు ముగ్గురు బిడ్డల పోషణ మాత్రం తమ వల్లకాదనే సరికి వ్యవహారం మళ్లీ వెనక్కు వచ్చేది.


మా అమ్మనాన్నా, మేనమామా అంతా ఆమెకు కుటుంబం గడవడానికి వ్యాపార మార్గాలు చూపించాలనుకున్నారు కానీ రాజీకి మళ్ళీ పెళ్ళి చేసి కొత్త జీవితాన్ని ఇవ్వాలని ఒక్కరూ ఆలోచించలేకపోయారు. అమ్మమ్మ మాత్రం తన చిన్న కూతురు జీవితాన్ని మళ్లీ చిగురింపచెయ్యాలని చాలా ప్రయత్నాలు చేసింది. ముగ్గురు బిడ్డల్నీ తను పెంచుకుంటానని మోతుబరి సూర్రావు సంబంధం ఖాయం చేసింది. ఇంట్లో వాళ్ళు కులం కట్లు బాట్లు పేర్లతో ఈ పెళ్ళికి ఒప్పుకోరని తిరుపతి తీసుకువెళ్లి రహస్యంగా పెళ్ళి చేయించి తీసుకువచ్చింది.


విషయం తెలిసి తాత వచ్చిన కోపాన్ని అమ్మమ్మ మీద తీర్చుకున్నాడు.ఇద్దరికీ పెద్ద గొడవైంది. ఇంటి పరువు పోతుందని మావయ్య రాజీని ఇక పుట్టిల్లు ఉన్న మాట మరిచిపోమన్నాడు. కానీ బిడ్డల పెంపంకం బాధ్యత మాత్రం తీసుకుంటానన్నాడు. కన్నీళ్ళు పెట్టుకున్న రాజీ సూర్రావు చిన్నాన్నతో కొత్త కాపురానికి ప్రయాణమయ్యింది. ఇద్దరూ కొత్తూరులో కొత్తకాపురం పెట్టారు. అరిటి గెలల వ్యాపారంలో బాగా సంపాదించిన సూర్రావు చిన్నాన్నకి భార్య చనిపోయి పదేళ్ళు దాటింది. ఊళ్ళో తాతల నాటి పెద్ద ఇల్లు, ఇద్దరు మగ సంతానం ఉన్నారు. ఇద్దరూ దాదాపు రాజీపిన్ని వయసు వాళ్ళే.. పెళ్ళి వయసు దాటిపోతున్న కొడుకులకు పెళ్ళి చేయకుండా తండ్రి రెండో పెళ్ళి చేసుకురావడం వాళ్ళకు సుతరామూ నచ్చలేదు. ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. రాజీ వెళ్ళి సంసారాన్ని రెండుగా చీల్చేసిందని సుర్రావు చిన్నాన్న చుట్టాలంతా రాజీని ఎవరిళ్ళకీ రానీయ లేదు. అయిన వాళ్ళందరినీ, కన్న బిడ్డల్ని వదులుకుని చేసుకున్న ఈ పెళ్ళి ఎవరికోసమో రాజీకి అర్థం కాలేదు.


సంవత్సరం బాగానే సాగిన రాజీపిన్ని జీవితం మళ్ళీ చిక్కుల్లో పడింది. సూర్రావు చిన్నాన్న లోడుతీసుకువెళ్లి తిరిగి వస్తుండగా రావులపాలం వంతెన మీద రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. చిన్నాన్న కొడుకులు తండ్రిని చంపేసిందని, నష్టజాతకురాలని ఇంట్లోంచి గెంటేసారు. మళ్లీ రోడ్డున పడ్డ రాజీ దొంగతనంగా అమ్మమ్మను కలుసుకుంది. అప్పుడే సెలవులకని అమ్మమ్మ ఇంటికి వచ్చిన నాకు రాజీ పిన్నిని చూసి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. మనిషి చాలా చిక్కిపోయి నీరసంగా తయారయింది. నాతో కలిసి ఆడుకున్న చిలిపితనం కానీ, చలాకితనం కానీ తనలో ఎక్కడా కనిపించలేదు. మనిషి పూర్తిగా నాకు తెలిసిన రాజీలానే అనిపించలేదు. మాట తీరు కూడా పూర్తిగా మారిపోయింది.


అక్క భారం మీద వేసుకోవడం ఇష్టం లేని మావయ్య బిడ్డల్ని తీసుకుని వెళ్ళిపొమ్మన్నాడు. అమ్మ మాత్రం రాజీ పరిస్థితికి జాలి పడింది. మాతో పాటు మేడపాడు తీసుకువచ్చింది. తెలిసివాళ్ళను అడిగి కుట్టు మిషను పెట్టుకోడానికి షాపు ఇప్పించింది. కొన్నిరోజులు మా పక్క వాటాలోనే అద్దెక్కున్న రాజీ..., ఉదయమంతా కుట్టుపని చూసుకుని సాయంత్రనికి షాపు నుంచీ తిరిగి వచ్చేది. పిల్లలు అప్పటి వరకూ మా ఇంట్లోనే ఆడుకునేవాళ్ళు.


వారం అంతా పనిలో ఉన్నా..ఆదివారాలు షాపు మూసేసి ఇంట్లోనే మాతో ఉండేది. పక్కనే ఉన్న పిల్లకాలవలో స్నానానికి వెళ్ళేవాళ్ళం. పెద్దగా నీళ్ళు పారని పిల్ల కాలవలో చిట్టి చేపలు పోతూ ఉండేవి. మోకాళ్ళ వరకూ చీరను ఎగ్గట్టి కాలవ గట్టుకిందకి దిగి నాచుపట్టిన మెట్ల మీద చెల్లిని కూచోపెట్టి ఇద్దరం ఈత కొట్టేవాళ్ళం. ఆ పక్కనే స్నానాలు చేసేవాళ్ళంతా మమ్మల్ని చిత్రంగా చూసేవాళ్లు. రాత్రికి ఆరు బయట పిల్లలు పెద్దాళ్లు అంతా చేరి సినిమా పాటలు పాడేవాళ్ళం. వండుకున్న వంటలన్నీ ఆ వెన్నెల్లో చాపలు పరుచుకుని తినేవాళ్ళాం. మడతమంచాలు ఆరుబయట వేసుకుని పడుకునేవాళ్ళం. చాలా రోజుల తరవాత రాజీ వచ్చాకా సరదాకా గడుస్తున్నరోజులు నాకు కొత్తగా అనిపించాయి. తనని వదిలి బడికి వెళ్ళాలనిపించేది కాదు. మనసంతా ఎప్పుడు ఆదివారం వస్తుందా అనే ఉండేది.


ఊళ్ళో వాళ్ళు కొత్తగా వచ్చిన రాజీ గురించి అమ్మని ఆరాలు అడగటం మొదలు పెట్టారు. అమ్మకూడా నెమ్మదిగా రాజీ అందం తన సంసారానికి అడ్డు పడుతుందనే ఆలోచనకు వచ్చేసింది. ఊరి వాళ్ళను అడిగి పోరంబోకు స్థలంలో చిన్న పాక వేయించి అక్కడ కాపురం పెట్టించింది. మళ్ళీ ఒంటరిగా మిగిలిపోయిన రాజీపిన్ని చూట్టూ మగ తుమ్మెదల వేట మొదలైంది. ఎన్నని తప్పించుకుంటుంది. వయసులో ఓ మగవాడితోడుతో సంసారాన్ని, వయసు భారాన్ని పొదిమి పట్టుకోవలసిన తన జీవితం రోడ్డు మీద పూరింట్లో ముగ్గురు బిడ్డలతో మిగిలిపోయింది.


అక్కడే రైస్ మిల్లులో పనిచేసే సత్తిరాజుతో పరిచయం అయ్యింది. ఆప్యాయత కోసం ఎదురుచూస్తున్న రాజీపిన్నికి సత్తిరాజు మాటలు మనసుకు దగ్గరగా అనిపించాయి. అతనికి పిల్లలంటే ఉన్న ప్రేమ తండ్రి ప్రేమగా మారుతుందనుకుంది. కొన్నిరోజులకి సొంతూరు వెళ్లి వస్తానని వెళ్ళిన వాడు మళ్ళీ తిరిగిరాలేదు. ఇలా తన జీవితంలో పరిచయమైన ప్రతి మగడిలోనూ ప్రేమను వెతుక్కుని చివరికి అది దక్కక ఆ ప్రేమలో ఉన్న ఆకర్షణలోపడి తాత్కాలమైన ఆనందాన్ని అందుకున్నా, తిరిగి తన చుట్టూ ఉన్న కుటుంబ బాధ్యత చట్రంలో ఇరుక్కుపోయేది.


అప్పుడు ఇప్పుడు తనకంటూ మిగిలింది ఆ కుట్టుమిషనే. కుట్టు మిషను ఆడితేనే తన జీవితం నడుస్తుందనే సత్యాన్ని అర్థం చేసుకోడానికి చాలా సమయం పట్టింది రాజీకి. తన జీవితంలోకి ఎందరు వచ్చినా తనకి పూర్వపు రోజులు తీరిగొచ్చినట్టు మురిసిపోయినా మళ్ళీ అవన్నీ చేజారిపోయినప్పుడు ఆ నిరాశ నుంచీ పైకిలాగి కడుపునింపే ఆధారం కుట్టు మిషనే అయ్యేది. అప్పుడు కూడా మేము ఉన్నామని అయినవాళ్ళ ఆసరా రాజీకి అందలేదు. తన జీవితంలోకి వచ్చి వెళ్లిన ప్రేమల తాలుకు జ్ఞాపకాలు రాజీకి లేకపోయినా వాటిని ఇంకా గుర్తుచేస్తూ రాజీని తప్పుచేసిన దానిలా నిలబెట్టారు. ఈ నిందలు రాజీని అయినవాళ్ళందరికీ దూరంగా.., ఎవరికీ తెలియకుండా ఎక్కడో దూరంగా బ్రతికేలా తరిమేసాయి.


మాకు దూరంగా ఎక్కడెక్కడో తన బిడ్డలతో బ్రతికింది. ఎప్పుడన్నా అమ్మమ్మ ఎవరికీ తెలియకుండా వెళ్ళి రాజీని కలిసి వచ్చేది. తను ఎక్కడ ఉంటుందో ఏలా ఉందో ఎవరికీ వివరాలు అవసరం లేకపోయింది. చివరికి తాత పోయినప్పుడు రాజీని శవాన్ని చూడడానికి రానివ్వాలని అమ్మమ్మ పట్టుబట్టింది. లోపల రాజీ మీద ఉన్న వ్యతిరేకతనంతా ఆ సమయంలో బయటపెట్టి రచ్చచేయడం ఇష్టంలేని మావయ్య అందుకు ఒప్పుకున్నాడు. రాజీ ఎక్కడ ఉంటుందో అమ్మమ్మకు మాత్రమే తెలుసు. తనే కబురుపెట్టింది. సాయంత్రం అయిపోతుందనగా ఆటోలో పిల్లలతో దిగింది రాజీ. బాగా ఎడిచి ఉబ్బిన కళ్ళతో... తాత బ్రతికున్నంత వరకూ రాజీని చీడపురుగులానే చూసాడు. అయినా ఆ శవం మీద ఎంతో ప్రేమగా పడి ఏడిచింది రాజీ. మనవలం అంతా ఓ మూలకి వాలిపోయి ఉన్నాం. రాజీ పిల్లలు బిక్కుబిక్కుమని చూట్టూ జరుగుతున్నది చూస్తున్నారు. అప్పటికే సమయం అయిపోవడంతో తల దగ్గర పెట్టిన అగరబత్తిలను పక్కకు తీసి శవాన్ని తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అదేం పట్టించుకోనే తెలివిలో లేని రాజీ కడుపులో పేగులు తెగేలా పెద్దగా ఏడుస్తూనే ఉంది. అందరం స్నానాలు చేసాకా రాజీ తడిజుట్టు ముడివేసుకుని మౌనంగా అమ్మమ్మ ఉన్న మూల గదిలోకి వెళ్ళి తనతోనే పడుకుంది ఆ పదిరోజులూ.


తాతపోయినప్పుడు చూసిన రాజీని మళ్ళీ నా పెళ్ళినాడు చూసాను. కళ్యాణమండపానికి వచ్చేసాకా గదిలో ఉన్న నాకు ఎవరో చెప్పారు రాజీ పెళ్ళికి వచ్చిందని. ఆమాట ఎంతో సంతోషాన్ని నింపింది. చెల్లితో కబురుపంపాను. అయినా తను నన్ను చూడడానికి రాలేదు. మనసు చివుక్కుమంది. తన పిల్లలను తీసుకుని పెళ్లి తంతు జరుగుతున్న మండంపంలో ఎక్కడో మూలగా కూర్చుంది. మామూలుగా అయితే రాజీ ఎంతో సంబరంగా నాతో పాటు నాపక్కనే మండపంలో ఉండాల్సింది. అందరూ అక్షింతలు వేయడం అయ్యాకా నాదగ్గరకి వచ్చింది. మనిషి పూర్తిగా మారిపోయింది. మునుపటి రంగులేదు. బాగా ఒళ్ళు చేసింది. ఎంతో దుఖాఃన్ని తన కళ్ళల్లో దాచుకుని నావరకూ వచ్చిందేమో.. నన్ను ప్రేమ నిండిన కళ్ళతో చూసింది. నేనూ లోపలినుంచీ తన్నుకువస్తున్న ఆప్యాయతతో కూడిన కన్నీళ్ళను అతి కష్టం మీద ఆపుకోగలిగాను. అయితే ఆరోజు రాజీతో ఒక్కమాట కూడా మాట్లాడలేకపోయాను.


ఈలోపు నా జీవితంలో వచ్చిన చాలా మార్పులు నన్ను నావాళ్ళకు దూరం చేసాయి. అందరినీ ఎదిరించి నేనుగా రాసుకున్న నా తలరాత పుట్టింటి నుంచీ నన్ను నెట్టేసింది.. నా అన్నవాళ్ళకు దూరంగా బ్రతుకుతున్న నాకు దాదాపు ఎనిమిదేళ్ళకు మళ్ళీ రాజీ గొంతు వినిపించింది. త్వరలో తనని మళ్ళీ కలవబోతున్నాను. ఏమో ఇప్పటి రాజీ నాకు తెలిసిన బాల్యంలోని అందాల బరిణ రాజీలా నన్ను దగ్గరగా కూచోపెట్టుకుని అన్నం పెడుతుందో.. లేక అందరూ అడిగినట్టు ఎందుకు దూరంగా వెళిపోయావని నిలదీస్తుందో. ఇప్పుడున్న రాజీ కాలం నేలరాసిన ఎన్నో తలరాతల జాబితాలో చేరిపోయిన ఓ కథగా మాత్రమే మిగిలిపోతుందో తెలీదు..

*

ఎటూచేరని కథ...



అతన్ని మొదటిసారి మా ఇంట్లోనే చూసాను. నూనూగు మీసాలు, కళ్ళు గుండ్రంగా గాజుకళ్ళు, నవ్వు, ముక్కు ముఖానికి ఏదో ప్రత్యేకతను తెచ్చిపెట్టినట్టు ఉంటాయి. నేను ఎందుకో ఆరోజు ఇంట్లోవాళ్ళ మీద అలిగి పడుకున్నాను. చాలాసేపటికి మొలకువ వచ్చింది. పెరట్లో నాన్నగారి గొంతు ఖంగుమని వినిపిస్తుంది. లేవటమే నా గదిలోంచి పెరటివైపుకు వెళ్ళాను. సాయంత్రం ఆరు కావొస్తుంది. ఇంకా వెలుతురు పోలేదు. మేడమీది జాజిపూలు విచ్చుకుంటూ గుప్పున సువాసన ఆ చుట్టూ అల్లుకుంది. పెరట్లో నాన్నగారు వాటర్ ట్యాంక్ కట్టిస్తున్నారు. నేను ఏం జరుగుతుందోనని నాలుగు అడుగులు వేసేప్పటికి- ఓ ఇద్దరు వాటర్ ట్యాంక్ కడుతున్నారు. ఇద్దరితో కూడా వచ్చిన ఒకడు ముందు వైపు నించుని దిక్కులుచూస్తున్న వాడల్లా నన్ను చాలా ఆసక్తిగా చూసాడు. నేనూ పక్కన నాన్నగారు ఉన్న సంగతి మరిచిపోయి మరీ అతన్ని గమనించాను. ఎత్తుగా, చాలా బలంగా, తెల్లగా ఉన్నాడు. వయసు ఓ పాతికేళ్ళు ఉంటుంది. రూపం గురించి టక్కున చెప్పాలంటే ఆంగ్లో ఇండియన్ లా ఉంటాడు. ఈ పనివాళ్ళ కాట్రాక్టరట. పక్కనున్న నాన్నగారు గమనించకుండానే నావంక చూస్తూ రహస్యమైన నవ్వు నవ్వి మళ్ళీ పనిలో పడిపోయాడు. అది మొదలు మా ఇంట్లో పని పూర్తయ్యేవరకూ అతను వచ్చినన్ని సార్లు అతన్ని నేనూ, నన్ను అతనూ గమనిస్తూ ఉండేవాళ్ళం. ఇద్దరం ఒకరిని ఒకరం గమనించుకునేవాళ్ళం. ఇద్దరికీ ఆ తరవాత ఏం చేయాలో తెలీదు. ఏమో అతనికి స్నేహితుల సాయం ఉందేమో, నాకు అదీ లేదు. కానీ తన కూడా ఉన్న చిన్న కుర్రాడు ప్రతిరోజూ మా ఇంటికి పాలకి వచ్చేవాడు. వాడే కొన్ని కబుర్లు మోసుకువచ్చేవాడు అతని గురించి. నేను మరీ ఆసక్తిగా కాకపోయినా మొత్తానికి తన గురించి అడిగేదాన్ని. అతనికి నేనంటే చాలా ఇష్టమని ఓసారి మా ఇంటికి వచ్చినప్పుడు ఆ కుర్రాడు చెప్పాడు. నేను మేడమీద పూలు కోయడానికి వెళ్ళినప్పుడు పక్క రోడ్డులోకి వచ్చి సైకిల్ మీదనే కూర్చుని నన్నే గమనించేవాడు. అలా ఎంతసేపైనా సరే.. నన్నే చూస్తూ ఉండిపోయేవాడు.
నాకూ ఆ అనుభవం బాగుంది. ఏదో కొత్తగా నా ఒంట్లోకి వచ్చి చేరిన అందంలాగా. ప్రతి రోజూ అతని గురించిన కబుర్లకోసం మనసు కొట్టుకునేది. ఎప్పుడన్నా వినాయకుడి గుడి దగ్గర ఎదురుపడితే కళ్ళతోనే పలకరించేవాడు. చిన్నగా మెత్తగా నవ్వేవాడు. ఎప్పుడూ మాట్లాడింది లేదు. కానీ అస్తమానూ ఒకటే ఊహ పదేపదే తరిమేది... ఓరోజు అత్తయ్య ఇంటికి వెళుతుంటే ఎదురైనట్టు... సైకిలు మీద ఎదురుపడినట్టు... సైకిల్ ఆపి నా దగ్గరగా వచ్చాడు. చేతిలో ఉన్న చాక్లెట్ నాకిచ్చి నన్ను తన బలమైన గుండెల మీదకు లాక్కున్నాడు. సెంటు కలిపిన చమటవాసన కమ్మగా ముక్కుని తాకింది. అతని కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాను. ‘‘నేనంటే నీకు ఇష్టమా.. నన్ను పెళ్ళిచేసుకుంటావా..’’ ఇంకా ఏదో అంటున్నాడు. అతని కౌగిలిలో చిక్కుకున్న నాకు అతని మాటలు నా చెవులను తాకుతున్న సంగతే తెలీడం లేదు. ఎంత బావుంది ఈ కౌగిలి....
తెసిన వాళ్ళ పెళ్ళి. పెళ్ళికూతురు నాకు తెలిసిన అమ్మాయే. నా స్నేహితురాలిని వెంటతీసుకుని ఆ పెళ్ళి కి వెళ్ళాను. ఇద్దరం కొత్తగా వచ్చిన వయసుతో పాటు, వయసుకు వచ్చినందుకు కుట్టించిన లంగా ఓణీల్లో బుట్టబొమ్మల్లా ముస్తాబయ్యాం. తలనిండుగా మల్లెపువ్వులు, మరువం నింపి వాలుజడ వేసుకున్నాను. అమ్మ దిష్టి తగులుతుందని వెళ్ళద్దంది. అమ్మమ్మ పోనీలే సరదాగా వెళ్ళిరమ్మని దగ్గరుండి ముస్తాబుచేసింది. అద్దం ముందు నన్ను నేను చూసుకుంటే ఎంత బావున్నానో. కాస్త గర్వంగా అనిపించింది.
ఇద్దరం పరికిణీలు చేతుల్లో పట్టుకుని జడకుచ్చులు ఊపుకుంటూ నడుస్తున్నాం. కళ్యాణ మండపంలో అతను కనిపించాడు. చుట్టూ ఉన్న స్నేహితులు అతనికి నన్ను చూపించి ఏడిపిస్తున్నారు. అతన్ని చూడాలంటే కళ్ళు బరువుగా పైకి లేవనన్నాయి. ఎక్కడి నుంచీ వచ్చి చేరిందో సిగ్గుల తెర అడ్డం పడింది. మండపంలో భజంత్రీల మోతలో పెళ్ళి కూతురి మెడలో తాళికడుతున్న పెళ్ళి కొడుకు. తలంబ్రాల తంతు కాగానే స్నేహితులంతా నవదంపతుల్ని చుట్టుకుని ఫోటోలు దిగుతున్నారు. పెళ్ళి తంతంతా నన్ను అతను గుచ్చి గుచ్చి చూస్తూనే ఉన్నాడు. నేనూ ఎవరూ గమనించకుండా అతన్నే గమనిస్తూ.
***
అతని మీద ఇష్టం లాంటిది పెరిగిందేగానీ దాన్ని అతనికి చెప్పే వీలు కలగలేదు. నేను ఎక్కడికి వెళుతున్నా అతనూ వచ్చేవాడు. అతను రాని సమయాల్లో దిగులుగా అనిపించేది. చిన్నగా వెలితి ఏదో వచ్చి చేరేది. చుట్టూ ఎందరున్నా ఒంటరిగా అనిపించేది. మాటలు లేకపోయినా అలా ఇద్దరం చూసుకుంటేనే చాలా బావుండేది. ఎప్పటికైనా నా మనసులో జరుగుతున్న రొదనంతా అతనిముందు పెడతానా అనే అనుమానం కలిగేది.
అతనూ ధైర్యం చేసి చెప్పాలనుకోలేదు. ఎప్పుడూ నన్ను గమనించడమేగానీ పెదవి మెదిపి ఒక్కమాట మాట్లాడలేదు. అలాంటి అవకాశమూ చిక్కలేదు. ఒకసారి తమ్ముడు న్యూయిర్ కోసం హడావుడి చేస్తున్నాడు. ఇద్దరం మా వాకిట్లో నిలబడి వేసిన ముగ్గు పదే పదే చూసుకుంటున్నాం. వాడు అక్షరాలు సరిచేస్తున్నాడు. ఇంతలో ఎక్కడినుంచీ వచ్చాడో అతను సైకిళ్ళ మీద స్నేహితులతో వస్తూ నా ముందు ఆగాడు. తన చేతిలో ఉన్న గ్రీటింగ్ నా చేతిలో పెట్టి అంతే స్పీడుగా వెళిపోయాడు. చాలా కంగారేసింది. అమ్మవాళ్ళు వస్తారేమోననే భయం. చూస్తారనే కంగారు. గోడ మూలకు పారిపోయాను. గ్రీటింగ్ నీలంగా ఉంది. చూట్టూ పూల కాగితం తెరిచి చూస్తే సంగీతం వస్తుంది. ఎంతో సంతోషంగా అనిపించింది. అక్కడే పక్కన తెలుగులో అక్షరాలు ‘‘ప్రియమైన...’’ అని.. మొదట సిగ్గేసింది. తర్వాత భయమేసింది. అంత పెద్ద సంగతిని ఎలా గుండెల్లో దాచుకోవాలో తెలీలేదు. ఏదో భారం మోస్తున్నట్టు అనిపించేది. ఎంతో దిగులేసేది. ఆ సమయంలో తనేం చేస్తున్నాడోనని. తనని చూడాలని మనసు కొట్టుకునేది. కానీ ఈ బాధలేం తెలీని ఇంట్లోవాళ్ళు చక్కగా కబుర్లు చెప్పుకునేవాళ్ళు. నవ్వుకునేవాళ్ళు. నాకేమో ఆకలి వేయడం మానేసింది. రోజంతా దిగులుగా గడిచేది. ఎవరు పంచుకుంటారు ఈ దిగులంతా. ఎవరు అతని వరకూ తీసుకువెళతారు నన్ను. ఇదే ఆలోచన. పంజరంలో ఉన్నట్టు తోచేది.
***
ఓ శీతాకాలం చీకటి చిక్కగా చలితో నిండిపోయింది. వీధిలో ఏవో అరుపులు. భోజనాలకు కూర్చున్నవాళ్ళంతా ఒక్కొక్కరూ వీధి గుమ్మంలో అరుపులకి అటు వైపు నడిచారు. నేను నాన్నగారి వెనక్కు వెళ్ళి నుంచున్నాను. ఎవరో పెద్దామె అరుస్తుంది. మా వీధి కరణాన్ని చూస్తూ.. మా గుమ్మం వేపు చూపిస్తూ.. నాన్నగారు లుంగీ ఎగ్గట్టి విషయం ఏంటని ఆరాతీసేసరికి ఆమె మాటలకు నా కాళ్ళల్లో ఒణుకు మొదలైంది.
‘‘ఏం చెప్పాలయ్యా... ఏం తెలీనట్టు అడుగుతావ్. నీ కూతురు నా సంసారంలో నిప్పు పెట్టేసింది. చేతికి అంది వచ్చిన నాకొడుకు నీ కూతుర్ని తప్ప మరొకరిని పెళ్ళి చేసుకోనంటున్నాడు. ముగ్గురు ఆడబిడ్డల తరవాత పుట్టాడయ్యా నాకు వాడు. ఎన్ని ఆశలు పెట్టుకున్నానో వాడి మీద. దీనికి అప్పుడే మొగుడు కావలసివచ్చాడా...’’
అరుస్తుంది నన్ను చూపించి. ఆ అరుపులకి నాన్నగారు నమ్మలేనట్టు నా ముఖంలోకి చూసి గట్టు మీదనుంచి నన్ను కిందకి లాగేసారు. ఒక్కసారిగా మెట్లకి పక్కగా పడ్డాను. ఆమె ఇంకా అరుస్తూనే ఉంది. నాన్నగారి మౌనం ఆమెకు అలా కలిసివచ్చింది. అలా ఎంతసేపో తెలీదు. చుట్టుపక్కల జనానికి వారానికి సరిపడా మాటాడుకునేందుకు సరుకు దొరికింది.
అమ్మ, నాన్నగారు లోపలికి వెళిపోయారు. నన్ను ఏంటి సంగతని ఒక్కరూ అడగలేదు. అమ్మమ్మ చేయిపట్టుకుని పైకి లేపింది. లోపలికి తీసుకువెళ్ళింది. చాలా రోజులు నాతో ఎవరూ మాట్లాడలేదు. నాకు నేనే అయ్యాను. ఇలా ఏదో పాపం చేసామన్న అపరాధంలోకి నెట్టేసినప్పుడు ఒంటరితనం మరీ భయంకరంగా ఉంటుంది.
***
ఎవరన్నా నన్ను ఏంటి సంగతని అడుగుతారని చూసాను. ఒక్కరూ అడగలేదు సరికదా.. నేను ఆ ఇంట్లోనే లేనట్టే ప్రవర్తించారు. రోజులు చాలా కష్టంగా నడుస్తున్నాయి ఈ ఇంట్లో. ఒక్కోసారి నేనేం చేసానని నన్ను అంతా ఇలా వెలేస్తున్నారని అడగాలనిపించేది. కానీ నన్ను నామాటని పట్టించుకునేదెవరు.
నేను ఏదో చేయరాని తప్పుచేసినట్టు దానికి పరిష్కారం పెళ్ళేనని అంతా తీర్మానించుకున్నారు. రోజంతా ఏవేవో మాటలు, శుభలేఖలు ఎన్ని వేయించాలి. కళ్యాణ మండపం, భోజనాలు, ఎవరిని పిలవాలి. ఎంతమంది వస్తారు. ఇవే ఇక. ఆ హడావుడిలో నేను అనేదాన్ని బ్రతికున్నట్టే అనిపించలేదు. ఊరి నుంచీ బావను రప్పించారు. మరో రెండు వారాలకు ఓ సాయంత్రం నన్ను పెళ్ళికూతురుగా ముస్తాబుచేసి కళ్యాణ మండపానికి తీసుకువచ్చారు. తలవంచుకుని కారులోంచి దిగుతున్న నాకు దూరంగా అతను నన్ను గమనిస్తున్నట్టు అనిపించింది. కళ్ళల్లో చిన్న కన్నీటి తడి. తల ఎత్తకుండానే కన్నీటిని కాటుక కళ్ళల్లో దాచేసి...

Saturday, 2 May 2020

కొన్ని ప్రేమలకు సాక్షం..




గతాన్ని తవ్వుకోడానికి కాస్త సమయం కావాలంతే ఎంత వెనక్కు వెళితే అన్ని కబుర్లు పుట్టుకొస్తాయి. నిన్న ఎందుకో కాకినాడలో బాల్యపుగురుతులు జ్ఞాపకానికి వచ్చినపుడు అలా తెరలా వచ్చి నిలిచిపోయిన చిన్న సంగతి మొదళ్ళో పుట్టి అక్షరాలుగా బయటకు వచ్చి చేరాలని పట్టుబట్టింది.

అది 1998-99 అనుకుంటాను. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వేసవి సెలవులకు వెళ్ళాం.. ఎటుచూసినా మామిడి చెట్లు.. పూతతో.. బరువైన కాయలతో నిండుగా ఉన్నాయి. కారం ఉప్పు పొట్లాలు కట్టుకుని మంచిఎండలో ఇంటినుంచి దారితీసేవాళ్ళం. ఎవరూ మమ్మల్ని పట్టించుకోరనే ధైర్యమే.. మేము అంటే పిన్నిపిల్లలు, నా తోబుట్టువులు అంతా కలిసి ఏడుగురం. మధ్యలో అత్త కొడుకులు కలిసే వాళ్లు. ఇక చిన్న రామదండే..ఈ రామదండుకు నేనే నాయకురాలిని. అంతా మధ్యాహ్నం బయలుదేరితే తిరిగి ఇంటికి చేరేసరికి సాయంత్రం ఆరయ్యేది. చుట్టూ మామిడితోటకు, కాయలకు కాపలాలు కాసేవాళ్ళు ఆ టైంలో కాస్త పడుకుంటారుకదా.. అది చాలు మేము మామిడికాయలు దొంగిలించడానికి. తెంపుకు వచ్చిన కాయలన్నీ చర్చి గుమ్మంలో పెట్టి కారం, ఉప్పు చల్లుకుని తినేసేవాళ్ళం. ఇక అప్పటినుంచీ అలుపొచ్చేవరకూ ఆటలు ఆడేవాళ్ళం.


మామిడితోటకు దూరంగా బ్రిటీష్ కాలంనాటి స్థూపం ఒకటి ఉండేది. పాడుబడినట్టు ఉన్న ఆ గొట్టం దగ్గర సైనికులు కాపలా ఉండేవారట. చుట్టూ గడ్డిపొదల్లో కాస్త భయంగా ఉండే ఆ స్థూపంలోపల చీకటిగా ఉండేది. దానివల్లో ఏమో దెయ్యాలున్నాయని పెద్దాళ్ళంతా పిల్లలకి భయం పెట్టారు. అయితే పాడుబడ్డవి చూడాలని అందులో ఏముందో తెలుసుకోవాలని అందరికీ కోరిక ఉంటుంది కదా.. నాకైతే మరీనూ.. ఓసారి అందరూ ఆటలో ఉండగా నేనూ మా అత్త కొడుకు.. నాకంటే చిన్నవాడు. వాడిని తీసుకుని మా రామదండుకి తెలీకుండా వెళ్ళాను. తుప్పలన్నీ తప్పించుకుని గొట్టం ముందు నిలుచుంటే లోపల చీకటిగా ఉంది. అత్తకొడుకుని అదే మా బావగాణ్ని లోపలికి పోయి చూడరా అంటే పోనన్నాడు. సరే నేనే వెళతాను. నువ్వు పారిపోకుండా ఇక్కడే ఉండమని చెప్పి లోపలికి సగం శరీరం పోనిచ్చేసరికి లోపల నుంచీ ఏవో మాటలు వినిపిస్తున్నాయ్..గుస గుసగా.. చాలా భయమేసినా పైకి తెలీనీయకుండా వెనక్కి జరుగుతూ బయటికి వచ్చేద్దామనుకుంటే మా బావగాడు లోపలికి తోసేస్తున్నాడు. వాడికి ఏం కక్ష ఉందో నామీద. తీరా లోపలికి వెళితే ఓ ప్రేమ జంట. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. అమ్మాయి పంతులుగారి కుతురు. అబ్బాయి మా ఎదురింటి రాజుగాడు.. అమ్మనీ.. అనుకుని బయటకు వచ్చేస్తుంటే.. ఇద్దరూ నన్ను ఆశ్చర్యంగా భయంగా చూసి ఎవరితోనూ చెప్పకు.. అని గుసగుసలాడారు. నేను వెనక్కి వచ్చేసాను.


ఇదేంటి రాజు గాడు .. పంతులుగారి అమ్మాయి..హవ్వ... నాకు లోపల ఎంత ఆనందమో.. అదే చిన్న రాక్షసానందం... లాంటిది. అదెందుకంటే చెపుతాను. మా ఇంట్లో ఆ పిల్లని చూపించి దానిలా చదువుకోమని ఎంత సతాయిస్తారో నన్ను... భలే ఈ సంగతి వీళ్ళ ఇంట్లో తెలిస్తే.. దాని వీపు పగిలిపోద్ది... అనుకున్నానే కానీ..ఆటల్లో పడి మరిచిపోయాను.. వాళ్ళు రెండురోజులు నేను ఎక్కడ చెప్పేస్తానోఅని భయపడినా.. చెప్పలేదని.. ఇద్దరూ తెగించేసారు.. ఒక్క నాదగ్గరే. మరో రెండు రోజులకి వాళ్ళ ఇద్దరూ కలుసుకోలేని సమయంలో వాళ్ళకి ప్రేమలేఖలు మోసే బంట్రోతునైపోయాను. ప్రేమలేఖ అందుకుని ఓ చాక్లేట్ ఇచ్చేవాడు రాజు. నూనూగు మీసాలతో నునుపుతేలిన పిల్లికళ్ళ అందగాడు. అప్పటికి వాడే మా వీధికి చిన్న జులాయి. చదువు వదిలేసి ఇంట్లో పడితినే సోమరని పెద్ద పేరు మాత్రం తెచ్చుకున్నాడు. ఈ ప్రేమకథ వ్యవహారం చాలారోజులేం సాగలేదు. నా సెలవులు అయిపోయి నేను మళ్ళీ మా ఊరికి వెళిపోయాను. చాలావరకూ ఆ సంగతే మరిచిపోయాను కూడా..తర్వత దసరాకి వచ్చినపుడు రాజు మామిడితోటలో గడ్డం పెంచుకుని.. కనిపించాడు.. పంతులుగారి అమ్మాయి కనిపించలేదు, పిన్ని కూతురు చెప్పింది.. ఇద్దరి ఇళ్ళల్లోనూ పెద్దగొడవైందని..ఆ అమ్మాయిని ఏదో ఊరు పంపేసారని.. వాడి చాక్లేట్లు తిన్న విశ్వాసం నేను చూపిద్దామని.. పాపం అనిపించి రాజుగాడిని పలకరించడానికి వెళితే.. వెకిలి నవ్వు ఒకటి నవ్వి.. పోనీలే ఓ రెండేళ్ళు ఆగుతాను.. నువ్వు నేనూ ప్రేమించుకుందాం..అన్నాడు వెధవ.


ఈ గొట్టం ఎన్ని ప్రేమ కథల్ని దాచిందో లెక్కేలేదు. ఎన్ని ప్రేమలు పుట్టి, పెరిగి, వీగిపోయినా వాటిని తన గోడలమీద పేర్లుగా మోస్తూ మౌనంగా ఉండిపోవడమే తెలిసిన ఈ గొట్టాన్ని మాత్రం అందరూ దెయ్యాల గొట్టమనే పిలుస్తారు పాపం.

ఇక్కడ పెట్టిన ఫోటో అచ్చం చిన్ననాటి స్థూపంకాదు.. వెతగ్గా వెతగ్గా గూగులమ్మ ఇచ్చింది.

ఓ పిట్ట కథ....




చిన్నతనంలో పుట్టిన ప్రేమలు భలే బావుంటాయ్.. నిజానికి అవి పెరిగి మరీ సిరియస్ కాకపోయినా ఎప్పుడు తలుచుకున్నా మంచి అనుభూతిని ఇస్తాయ్. నాకు అలాంటి ప్రేమలు లేకపోయినా అలాంటి ప్రేమకథల చుట్టూ నేనున్నాను. ఎన్ని కథలో అన్ని జ్ఞాపకాలు. కొన్ని బయటకు చెప్పేవి. కొన్ని చెపితే స్నేహాలు పోయేవి. అయినా ధైర్యంచేసి కొన్ని తలలు మార్చి(లింగాలు), పేర్లు మార్చి.. నానాతంటాలు పడి.. మొత్తానికి అక్షరాల్లో బంధించాను. వాటిని చదివిన నేస్తాలు కొందరు అలిగారు. కొందరు ఇదేం పనని నొచ్చుకున్నారు. అయినా తెలిసిన సంగతులను అక్షరాల్లో చూసుకోవడం ఎంత బావుంటుందో వాళ్ళకేం తెలుసు.. ఈ పిట్ట కథ కూడా ఆ బాపతే..

“వస్తాను.. అన్నాకా వస్తాను.. నువ్వు మరీ నొక్కి చెప్పకు”...విసుక్కుంది నవ్వ.. కాస్త పొట్టిగా తెల్లగా బాదంపాలంత సున్నితమైన చర్మంతో మెరిసిపోయే నవ్వకి కిరణ్ పరిచయమయ్యి నాలుగేళ్ళు.

అప్పటినుంచీ ఇద్దరూ మంచి స్నేహితులు.. తర్వాత ప్రేమికులు. ఇద్దరూ ఎన్ని కబుర్లు చెప్పుకున్నా కిరణ్ కి ఏదో లోటు. తనని ప్రేమిస్తున్నానని చెప్పడానికి ఎన్నిపాట్లుపడ్డాడో.. వాడికి.. నాకు చిన్నతనం నుంచీ మంచి దోస్తీ. కాకపోతే నవ్వ వచ్చాకా అది కాస్త తగ్గింది. ఎప్పుడు చూసినా వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతూ వాళ్ళ అమ్మ చెప్పిన పనులు చేయడంతోనే సమయమంతా గడిచిపోయేది వాడికి. మాతో క్రికెట్ ఆడుకోడానికి రమ్మంటే రావడానికి సమయం చిక్కితే కదా. కిరణ్ వాళ్ళకు జీతం లేని పనోడైపోయాడు. ఫిబ్రవరి మాసం వస్తుందనగా ఓసారి నాదగ్గరకొచ్చి ఏదైనా ఐడియా చెప్పమన్నాడు. నవ్వకి లవ్ ప్రపోజ్ చేయడానికి. నాకు తెలిసిన రెండు పాత అరిగిపోయిన ఐడియాల్లో ఒకటి గ్రీటింగ్ కార్డు ఇవ్వమన్నాను. అది కొని కాకుండా నువ్వే చేసి ఇస్తే ఇంకా బావుంటుందని సలహా ఇచ్చాను. రెండురోజులు తెగ కష్టపడి మొత్తానికి గ్రీటింగ్ కార్డ్ రఢీ చేసాడు. చూడ్డానికి అదో పుస్తకంలా కనిపించినా తెరిచాకా థర్మకోల్ తో తయారుచేసిన లవ్ సింబల్ కి ఎర్రటిరంగేసి దానిచుట్టూ ఐ లవ్ యూ అనే అక్షరాలున్నాయి. ఓ పక్కగా చాకెట్ల్ కూడా అంటించాడు. నేను ఇచ్చిన ఐడియాకి వాడిచ్చిన రూపం వాడికన్నా నాకే తెగ సంబంరంగా అనిపించింది. ఏంటో ఈ ప్రేమ పుట్టకుండా ఉండాలేగానీ పుడితే ఇక అంతే..

అనుకున్న రోజు వచ్చేసింది. ఉదయం నేరేడు చెట్టుదగ్గర పాలుపోయించుకోడానికి వచ్చిన నవ్వకి సాయంత్రం గాంధీ పార్కుకి రమ్మని చెప్పాను. ఏంటి విషయం అని ఆరాతీసింది. ఏమో కిరణ్ నీతో మాట్లాడాలన్నాడు. అని మాత్రం అనేసి ఇంటికొచ్చేసాను. కిరణ్ గాడు ఇంట్లో ఇచ్చినవి.. మాదగ్గర పోగేసిన డబ్బున్నీ కలిపి కేక్ కూడా కొన్నాడు.

సాయంత్రం ఆరింటికి స్కూల్ వదలగానే పక్కనే ఉన్న గాంధీ పార్కులోకి చేరాం. కిరణ్ బ్లూ కలర్ షర్టు, బ్లాక్ ఫేంట్ వేసుకున్నాడు. ఎప్పట్లానే నవ్వ నవ్వుతూ తిప్పుకుంటూ మాతో వచ్చింది. నిజానికి ఈ అమ్మాయిలకి పక్కనే ఉన్న అబ్బాయి మనసులో ఏం జరుగుతుందో తెలుసు.. కానీ తెలీనట్టు నటిస్తారంతే.. అంతా డూపు.. నవ్వ సిగ్గు చూసిన ఎవరికైనా అది ఇట్టే అర్థమైపోతుంది.
కనుచీకటి పడిందేమో పార్కులో లైట్లు వెలుతురులో వెదురుపొదల చాటుగా కిరణ్ నవ్వా మాట్లాడుకుంటున్నారు. దూరం నుంచీ చూస్తున్నమాకు మాత్రం ఆ దృశ్యం చాలా అందంగా అనిపించింది. ఎలాగైతే మావాడు ఈరోజు తన మనసులో మాట చెప్పేస్తాడు అనుకున్నాం.

ఇంతలో ఎక్కడి నుంచీ ఊడిపడిందో నవ్వ చెల్లెలు మాతో మా స్కూల్ లోనే చదువుతుంది. నవ్వకు కాస్త దూరంలో నిలబడి గట్టిగా కేకపెట్టింది. అక్కా ఇక్కడేం చేస్తున్నావే.. అమ్మతో చెపుతానుండు. నువ్విక్క ఉన్నావని.. అని అరుచుకుంటూ గెటు వరకూ వచ్చేసింది. అక్కడే బెంచీ మీద కూర్చున్న మాకు విషయం తెగలేదని తెలిసి బాదేసినా.. కాస్త నీరసం వచ్చినా.. చేసేదేం లేక కిరణ్ గాడి చేతిలో ఉన్న కేక్ మీదకు పోయింది దృష్టి.. అందరం తలా ఒక ముక్కా తినేసి నెమ్మదిగా ఎక్కడివాళ్ళం అక్కడికి జారుకున్నాం.

మరో రెండురోజులు స్కూలుకి రాని నవ్వ గురించి మా కిరణ్ తెగ బెంగ పడిపోయాడు. ప్రేమలో ఉన్నప్పుడు హుషారైన ప్రేమ పాటలు వినాలని, ఫేయిలయితే విషాదపు పాటలు వినాలని ఎవరు చెప్పారో గానీ పక్కనే ఉన్న స్నేహితులకు అది ఎంతపెద్ద శిక్షో. కిరణ్ గాడి వాక్ మేన్ పాటలు వింటే ఒక్కోసారి జీవితం మీద విరక్తి కలిగేది. ప్రేమ ఫలించినా, ఫలించకపోయినా ఆ ప్రభావం ఆ ప్రేమికులకన్నా పక్కనున్న స్నేహితుల మీదనే ఎక్కువగా పడుతుంది. నాలుగురోజులకు గానీ నవ్వ మళ్ళీ మాకు కనిపించలేదు. అప్పటి వరకూ దగ్గరగా ఉన్న స్నేహితులందరినీ చెదరగొట్టి నవ్వే అన్నీ అయిపోయింది. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిన సంగతి మొత్తం స్కూలంతా తెలిసిపోయింది.

స్కూలు తర్వాత కొందరు కాలేజీ చదువులు, కొందరికి పెళ్ళిళ్ళు అయిపోయి కొన్నేళ్ళకు ఎవరు ఎక్కడున్నారో తెలుసుకునే ప్రయత్నంలో నవ్వ బెంగుళూరులో ఉంటుందని తెలిసి ఫేస్ బుక్ లో పలకరిస్తే తను చాలా బావున్నానని, వాళ్ళాయన తనని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడని ఇంకా ఎన్నో చెప్పింది. ఒక్కమాటన్నా కిరణ్ గాడి గురించి అడక్కుండానే మా సంభాషణ ముగిసిపోయింది. ఇక కిరణ్ మా ఊళ్ళోనే పెద్ద వడ్డీ వ్యాపారస్థుడిగా పేరు బోలెడు కట్నంతో పాటు అందమైన భార్య తెచ్చిపెట్టిన పలుకుబడి మధ్య దజ్జాగా బ్రతికేస్తున్నాడు.

కొన్ని ప్రేమలు గమ్యం చేరకపోయినా గతంలోకి పోయినపుడు గుండెకు గుచ్చుకుంటూ తెలియని సుతిమెత్తనైన నొప్పి తెచ్చిపెడతాయి. మరికొన్ని గమ్యం చేరి ముచ్చటగొలుపుతాయి. ప్రేమ పుట్టి గమ్యం చేరేలోపు ఎన్ని మార్పులో.. ఎన్ని పురిటి నొప్పులో.

నీలోకి ఒలికిపోయాననీ..

ఈరోజుకి రాసే ప్రేమలేఖ ఇది..  కొన్నిసార్లు అనిపిస్తుంది.  నేను నీలోకి ఒలికిపోయాననీ..  నీలోకి వచ్చి చేరాకా హృదయంలోని నిశ్శబ్దానికి...