Friday, 12 January 2018

నా....



(మొదటి భాగం)
వర్షం పెద్దదైయ్యేలా ఉంది. పిన్ని తలుపుతీస్తే బాగుండును. ఈ చలిలో చిరుగుల దుప్పటితో ఈరాత్రి గడపడం నావల్లకాదు. పైగా గొట్టమేసి లాగేస్తున్నాయి మిగిలిన ఆ కాస్త రక్తాన్నీ ఈ దోమలు. మూడు నెలలైనా ఇంకా ఈ పరిస్థితులు నాకు అలవాటు కావడంలేదు. పిన్నికి రానురాను నేను భారమైపోతున్నాను. తను నన్ను చూసే తీరు కూడా మారిపోయింది. భోజనం మోతాదూ తగ్గించేసింది. ఏదో తప్పదన్నట్టు ఉదయాన్నే నిద్రలేచేసరికి నాకోసం, నీళ్ళ కాఫీ, రెండు ఇడ్డెనలు చేసి పెడుతుంది. కాస్త విసురుగానే పెడుతుంది. అవి మింగేలోపు  ఏరా సత్తిబాబు ఇప్పటికి ఏంత డబ్బు పోగేసావేంటి అంటూ నస మొదలెడుతుంది. చాలురా దేవుడా ప్రాణం నిలుపుకోడానికి అనుకుంటూ అవి కాస్తా గుటకేసి ఆమె అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండానే ఊ... ఊ... అంటూ, చిన్నాన్న డొక్కుసైకిలేసుకుని రోడ్డు దారి పడతాను.

మాటలకే మేం ఐదుగురు మగ సంతానం. ఒక్కడూ ప్రయోజకులు కారు. పెద్దోడు చిన్ననాడే పెంపకం వెళ్ళిపోయాడు, రెండోవాడు బిఎ చేసి పట్టాపుచ్చుకుని ఫేను కింద ఉద్యోగం కోసం వెతుకుతూ ఖాళీగా తిరుగుతున్నాడు. మూడోవాడ్ని నేను. నా తర్వాత పెళ్ళీడు కొచ్చిన చెల్లి, ఇద్దరు తమ్ముళ్ళు ఇంకా చదువుకుంటున్నారు. నా చిన్నపుడే నాన్నకు పేగు జారిపోతే పెద్ద ఆపరేషను చేసారు, మనిషి చిక్కిపోయాడు, పెద్దగా కష్టపడలేడు. సంసారం గడవడం కష్టమైపోయింది. బాధ్యత పంచుకునే వారు లేకపోడంతో, ఇక నాకు తప్పలేదు. ఎనిమిదోతరగతి పక్కనపెట్టేసి నాన్న చుట్టలకొట్టెక్కాను. కొన్నాళ్ళు బాగానే నడిచింది, ఇప్పుడు అదీ దివాలాతీసింది. తనవంతు సాయం చెయ్యాలి కదా అని నాన్న దాన్నే నమ్ముకున్నాడు, నేను మాత్రం బ్రతుకుతెరువుకోసం పెరిగిన ఊరిని, నావాళ్ళను వదిలి ఎక్కడో బీరకాయ పీచు సంబంధం పట్టుకుని ఈ ఊరుగాని ఊరొచ్చాను. ఇక్కడికొచ్చాకా తెలిసింది బ్రతకడం ఎంత కష్టమో. స్నేహితుడి సాయంతో చీరల మిల్లులో చేరాను. అప్పటి నుండీ చాకిరీతోనే సాగుతుంది జీవితం. చెయ్యెత్తు గోడతో తుప్పట్టిన ఇనుపగేటుతో స్వాగతం పలుకుతుందీ గౌతమీ ఫేబ్రిక్సు చీరల మిల్లు. ఆనవాలు మాసిపోయి అక్షరాలు చెదిరిపోయి,.

పద్దెనిమిది ఏళ్ళ ప్రాయంలో ప్రతి అబ్బాయీ రంగురంగుల కలలు కంటూ ఉంటే నేను మాత్రం ఎన్నో రంగుల మధ్యా, దారాల మధ్యా ముఖం ఎత్తకుండా పనిచేసుకుంటున్నాను. పేగులు దేవేసే రంగులవాసన, ఏం తిన్నా రంగులు రుచి చూస్తున్నట్టే ఉండి వాటి వాసన చేతులకంటి వదలదు. ఎత్తు బల్లలకు మైనం పూతలు, చుట్టూ హడావుడి, ఉతుకుతూ, ఆరేస్తూ, గుట్టలుగా పడున్న చీరలు, ఓ డిజైనుకి పేరొచ్చిందంటే అందులోనే వేల చీరలు తయారైపోతాయి. పక్క మిల్లులతో పోటీలు పడి మరీ తయారవుతాయీ చీరలు. ఏ తల్లి కడుతుందో తెలీదు కానీ..... నెలంతా చాకిరీ చేస్తే వచ్చే ఆ రెండొందలు ఇంటికి పంపేసి చేతులు దులుపుకోను. రాత్రి పూట కూడా పని చేసి కొంత సంపాదిస్తాను. ఆ ఓటీ డబ్బులన్నీ నాతో పనిచేసే తాతారావనే పెద్దాయన దగ్గర దాస్తాను. పెళ్ళీడుకొచ్చిన చెల్లికి చీరముక్కో, జాకెట్టు ముక్కో కొనాలనే తాపత్రయం నాది.

మొదట్లో వీళ్ళలో ఇమడలేకపోయినా, రానురాను ఈ వాతావరణంలో ఇంకిపోయాను, రంగుల్లో కలిసిపోయాను. ఇక్కడికొచ్చాకా తాతారావు బాబాయ్ తర్వాత ఇంకాస్త నేను దగ్గరైంది మాణిక్యానికి. మనిషి చాలా మంచివాడు. ఎదుటివాళ్ళ కష్టాలు తెలుసుకోవాలనే కోరికలేనివాడు. ఎందుకంటే తనకే తలకుమించినన్ని బాధలున్నాయి కాబట్టి. ఇద్దరికీ ఈ కారణంగా స్నేహం కుదిరిందంటే ఒప్పుకోను. మా ఇద్దరికీ హీరో చిరంజీవంటే చాలా ఇష్టం అతని సినిమాలు చూడాలని మనసు నిండా కోరికున్నా కుదిరేదికాదు. ఎప్పుడో ఊళ్ళో ఉండగా చిన్నన్నయ్యతో చూసిన సినిమాలే, చివరగా చూసింది శుభలేఖఅని గుర్తు. చిరంజీవి సినిమాలో మీసం ఎలా పెట్టాడో, ఎలా క్రాపు దువ్వాడో అలా తయారైపోయి ఊరంతా సైకిలు మీద చుట్టి వచ్చే వాళ్ళం. మరిప్పుడో సినిమా మాట వినపడి చాలాకాలమైంది.

 ఓరోజు తాతారావు బాబాయ్ అన్నాడు. సినిమాకెళదమని. నాదగ్గర డబ్బులేదన్నాను. మాణిక్యం మాటా అదే. ఆ నాదగ్గరా డబ్బులు లేవు. సినిమా హాల్లో టిక్కెట్లు ఇచ్చే సుబ్బడు నా దూరపు చుట్టం. వచ్చేమాటైతే చెప్పండి వాడికి ముందుగా కబుపెడతాను అన్నాడు. చాలా ఆనందం వేసింది. మాణిక్యం చిన్నగా తటపటాయించినా మొత్తానికి ఒప్పుకున్నాడు.
మేము సినిమా హాలుకి చేరే సరికి సాయంత్రం ఆరు కావస్తుంది. హాలు చివరిగా గోడకానుకుని సిగరెట్టు కాలుస్తున్న వ్యక్తిని సుబ్బడు తెలుసా అని అడిగేలోపు, నేనే సుబ్బడ్డి. మీరేవచ్చారేటి మా తాతారావు మావయ్యేడి. ఇంకా ఆట మొదలుకాడానికి పది నిముషాలే ఉంది అందరూ కలిసి రాలేదా ఇలా ఒకటే ప్రశ్నలు మొదలు పెట్టాడు. మాణిక్యం నేనూ మిల్లు నుండీ సరాసరి ఇక్కడికే వస్తున్నాం. ఓనరు పనిమీద బాబాయ్ బైటికెళ్ళాడు, మమ్మల్ని ముందు పదమన్నాడు. తను వెనకందుకుంటాడట. అంటూనే అతని చేతిలో టికెట్లు పుచ్చుకుని హాలులోకి వెళ్ళిపోయాము. హాలంతా మాసినపోయి, నేలంతా పెచ్చులూడిపోయి ఉంది, అక్కడక్కడా మోత చేసుకుంటూ కష్టంగా తిరిగే ఫేనులు, కుచ్చీల్లో కొబ్బరి పీచు పైకి లేచిపోయి గుచ్చుకుంటుంది. తెరంతా మాసిపోయి, హాలంతా ముక్కవాసన కొట్టుకుంటూ, పాతాళభైరవి కాలంనాటి సినిమాహాలులా వుంది.

పేర్లు పడే సమయానికి వచ్చాడు బాబాయ్. హాలంతా నిండిపోయి చిరంజీవి తెర మీదకు రాగానే ఒకటే ఈలలు, గోల. రోజంతా ఎలాగూ నోరు మెదపరు. కాస్త ఈపూటైనా ఆ మూగనోము చాలించి సరదాగా గడపండయ్యా అంటూ పెద్దగా కేకేసాడు బాబాయ్. సినిమా బాగుంది. నల్లులు కుట్టినా నొప్పి తెలీనంత బాగుంది.

 సినిమా చూసి ఇంటికి వచ్చేసరికి బాగా పొద్దుపోయింది. ఇంటిబైట దీపాలారిపోయి ఉన్నాయి. తలుపులేసుకుని అంతా గుర్రు కొడుతూ పడుకుండిపోయారు. కనీసం నేనొస్తానని, కాస్త కూడు తింటాననేలేదు పిన్నికి. కాసేపు చూసి ఉసూరుమంటూ అరుగుమీదే పడుకుండి పోయాను. తెల్లారి పిన్ని రాత్రి నావాటా అన్నం గంజిలో వేసి తెచ్చిపెట్టింది. చూడు నాయనా అన్నానికి రావడం కుదరకపోతే ఎవరితోనైనా కబురంపు. అంతేగానీ రాజుగారి దివాణంలోలా వండి వడ్డించడానికి ఇక్కడ మీ చిన్నాన్నకు జమీలేం లేవు. కసురుకుంటూ ఎంత వడిగా వచ్చిందో అంత వడిగానూ ఇంట్లోకి వెళిపోయింది నామాట వినకుండానే.
ఆ రోజంతా మనసేం బాగాలేదు. చిన్నతనం అలానే ఉండిపోతే బాగుండుననిపించింది. ఏబాధ్యతాలేనితనం, లోకమంతా కొత్తగా వింతగా కనిపించేది. ఇప్పుడు ఓ నిముషం కూడా నాదికాదు. డబ్బుది. ఈ కాస్త సమయంలో ఎంత సంపాదించగలనని లెక్కలు కడుతున్నాను. నాన్న ఉన్నదాంట్లోనే దర్జాగా పెంచుకొచ్చాడు మమ్మల్ని. కానీ కొన్నేళ్ళ క్రితం నాన్నకు పేగుజారిపోతే నాలుగు ఆపరేషన్లు చేసారు. మనిషి చిక్కిపోయాడు. అందరూ అన్నట్టు నాన్న పిల్లల్ని పెంచలేక పెంపకానికి ఇవ్వలేదు. పెదనాన్నకు పిల్లలు లేరని అమ్మ వద్దన్నా బలవంతంగా అన్నయ్యను చిన్ననాడే పెంపకం పంపాడు.

 నాకు ఊహ తెలిసే నాటికి నాన్నకు పెద్ద పచారీ కొట్టు ఉండేది. అందులో  అమ్మని వస్తువంటూలేదు. కొట్టులో అమ్మే వాటికన్నా మా నోటిలోకి పోయేవే ఎక్కువ. నాన్నకు ఈ విషయం తెలిసినా ఊరుకునేవాడు. చెల్లి, నేను దొంగతనంగా జీడిపప్పు జేబులో వేసుకుని ఎత్తుకొచ్చేసి తినేవాళ్ళం. తోబుట్టువులందరిలోకీ ఆకలి, నిద్ర ఎక్కువ నాకే. వాటికోసం వాళ్ళతో పోటీపడేవాణ్ణి.  పగలు రాత్రి తేడాలేకుండా ఆటలాడుకుని ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు మళ్ళీ నాన్న చూసి లేపేస్తాడేమోనని మంచం కింద దూరి నిద్రపోయే వాడిని. నేను పడుకునే చోటు తెలుసుకుని లేపి మరీ అన్నం పెట్టేది అమ్మ. అమ్మకు నా ఆకలిసంగతి తెలుసు. చదువుకోసం పక్క ఊరికి పంపిస్తే నాలుగు కిలోమీటర్లు వెళ్ళి వచ్చేసరికి ఆకలితో రెండు వీధుల నుండీ అరిచేవాడిని అమ్మా అమ్మా అంటూ. నేను ఆకలితో వస్తానని చేతిలో అన్నం కంచం పట్టుకు ఎదురు చూసేది అమ్మ.

ఓ రోజు ఆటలాడుకుంటూ పంచదార బస్తాలో కిరసనాయిలు పారబోసేసాం చెల్లి నేను. అమ్మ నన్ను కాపాడటానికి నేరం తన మీదేసుకుని నాన్నతో తిట్లు తింది. అంతేకాదు అమ్మ, నాన్నకు తెలియకుండా మిద్ది మీద బొగ్గుల కుంపటిలో రూపాయి కాసుల్ని పైకి కనిపించ కుండా ధాన్యం కప్పి దాచింది. అది నా కంట పడింది. అప్పట్నుండీ డబ్బు కావాల్సినప్పుడల్లా మిద్ది మీదకు పోయేవాడిని. చిన్నప్పుడంతా బండోడిని అనేవారు. ఇరుగుపొరుగుతో నాన్నకు లేనిపోని తలనొప్పులు తెచ్చిపెట్టేవాడిని. కోపంలో ఎంత కొట్టినా దెబ్బలకు లెక్కచేసేవాడిని కాదు. ఇప్పుడు మాత్రం చిన్నమాటంటేనే కోపం, విసుగు వచ్చేస్తున్నాయ్.

నాన్న ఉత్తరం రాసాడు. చెల్లికి దూరపు సంబంధం కుదిరింది పెళ్ళి ముహుర్తం ఖాయం అయ్యేలా ఉందంటూ. నాకు తెలుసు చూచాయిగా డబ్బు పట్టుకురమ్మని దాని సారాంశం. ఇప్పటి వరకూ పోగుపడ్డ డబ్బు తీసుకుని బండారులంక బైలుదేరాను. అబ్బాయి గవర్నమెంటు ఉద్యోగం చేస్తున్నాడు. మంచి కుటుంబం. ఇప్పటి మా స్థోమతకు మించిన సంబంధమే అయినా చెల్లెలు సుఖంగా ఉంటే అంతే చాలు. అంతా అదే అనుకున్నాం. నేను పట్టుకెళ్ళిన డబ్బు పెళ్ళిఖర్చులకు సరిపోలేదు. అమ్మ నగలు కుదువ పెడితేగానీ చెల్లి పెళ్ళి జరగలేదు. ఇందులో కాస్త ఆనందం ఏమంటే ఎవరినీ సాయం అడగకుండానే పెళ్లి జరిగిపోవడం. పెద్దన్నయ్య పెళ్ళికి రాలేదు బెంగుళూరు వెళ్ళాడట ఉద్యోగం పనిమీద. పెదనాన్న, పెద్దమ్మ వచ్చారు. మాటల్లో నేను ఎప్పుడూ చెల్లిని వెక్కిరించేవాడిని, ఆకాశం అంత పందిరి వేసి, భూదేవంత అరుగు మీద నీ పెళ్ళి చేస్తానని. మాటకేంగానీ మా వాకిలంత పందిరేయడం ఎంత కష్టమో తెలిసొచ్చింది. బావగారు అంత కలుపుకోలు మనిషి కాదుగానీ మంచివాడిలానే కనిపిస్తున్నాడు.

పెళ్ళైన నాలుగో రోజే ఊరికి బయల్దేరిపోయాను. గుమ్మంలోకి రావడమే ఏరా సత్తిబాబు అంతా బాగానే జరిపించావుగానీ నిన్ను కడుపులో పెట్టుకు చూసుకుంటున్నానే నాకో చీరముక్కన్నా పెట్టిందారా మీ అమ్మ, ఇవేం పద్దతులురా నాయనా, పెద్ద ముండని ఎంత ఇదిగా చూసుకోవాలి. నా కోడలు అడిగితే ఏం సమాధానం చెప్పాలో తెలీలేదు. అంత దూరం నానాపాట్లూపడి వస్తే మంచి సన్మానమే చేసావులే విసుక్కుంటూనే ఉంది పిన్ని. చిన్నాన్న సంగతి మామూలే ఏం వినపడనట్టు తన పనిలో మునిగిపోయాడు. నేను మళ్ళీ మిల్లు మీదగా వెళ్ళిపోయాను.

చెల్లి పెళ్ళయి నెల కావస్తుంది. నాన్న ఉత్తరం రాసాడు - చెల్లిని కాపురానికి పంపాలంటూ, డబ్బు పంపమని. నేను చెమటోడ్చి దాచిందంతా పెళ్ళికే అయిపోయింది. తాతారావు బాబాయ్ తెలిసినవాళ్ళదగ్గర అప్పు ఇప్పించాడు. నేను రోజూ ఇంకో గంట కష్టపడితే సంవత్సరం పడుతుంది అప్పు తీరడానికి సరే అవసరం ముఖ్యంకదా ఒప్పుకున్నాను. చిన్నప్పుడు మావయ్య ఎప్పుడూ ఓ పాట పాడేవాడు. ధనమేరా అన్నింటికీ మూలం.... ఆ ధనము విలువ తెలుసుకునుట మానవ ధర్మం అని అది ఇప్పుడు తెలుస్తుంది. చెల్లి కాపురానికి వెళిపోయాకా అమ్మావాళ్ళని ఓ మంచిల్లు చూసి రాజమండ్రి తీసుకువచ్చేసాను.
ఇక్కడికి రావడమే అమ్మ చిన్నన్నయ్యకు, నాకు సంబంధాలు వెతకడం మొదలుపెట్టింది. కాస్త కట్నం తెచ్చే కోడళ్ళ కోసం.
తను అనుకున్నట్టుగానే రెండో అన్నయ్యకు నచ్చిన సంబంధమే తెచ్చి చేసింది అమ్మ. అన్నయ్య ఉద్యోగం సంపాదించేలేపే, వదిన తెచ్చిన కట్నం కరిగిపోయింది. నెమ్మదిగా వాడి సంసారం కూడా నామీద ఆధారపడింది.

* *

పెద్దన్నయ్యకు బ్యాంకులో మంచి ఉద్యోగం వచ్చింది. అనుకోకుండా మంచి సంబంధం కుదిరిందని, మా అందరినీ ముందుగానే పెళ్ళికి రమ్మని పెద్దమ్మ, పెదనాన్నా చెప్పివెళ్ళారు. పదిరోజులు మిల్లుకు సెలవు పెట్టి నాన్న వాళ్ళను తీసుకుని కాకినాడ వెళ్ళాను. వదినవాళ్ళది బాగా కలిగిన కుటుంబం,  ఇద్దరు కొడుకులు ఒక్కత్తె  ఆడపిల్ల, చాలా గారాబంగా పెంచారు, అందగత్తె, బాగా చదువుకుంది. మా అన్నయ్యగాడు ఏలా చూసుకుంటాడో అన్నది తప్ప, ఇద్దరూ చక్కని జంట. మాలో మాకు చిన్న చిన్న పొరపొచ్చాలు వచ్చినా పెళ్ళి చాలా బాగా జరిగింది.

ఈ పెళ్ళిలోనే చూసాను వదిన పిన్ని కూతురట, అమ్మాయి చాలా బాగుంది, బుట్ట బొమ్మలా అమాయకపు నవ్వు నవ్వుతూ, అందరినీ పలకరిస్తుంది. వాళ్ళ అక్కను ఒక్కక్షణం ఒదలకుండా తిరుగుతుంది. పెళ్ళి చూడ్డంకన్నా తనని చూడటంతోనే కాలం గడిచిపోయింది. వాళ్ళదీ రాజమండ్రే, ఒకప్పుడు బాగా బతికిన కుటుంబమట, తండ్రి వ్యసనాలకు బానిసైపోయి ఆస్తంతా కరిగించేస్తే పచారికొట్టు పెట్టుకుని సంసారాన్నంతా, తల్లితోపాటు ఈ అమ్మాయే చూసుకుంటోందట. నాలానే కష్టపడే మనిషి, చక్కని రూపు, తనని చూడగానే అనిపించింది తనతోనే నా జీవితమని.

తాతారావు బాబాయ్ మాటల్లోనో, మావయ్యతో మంచి కబుర్లలలో ఉన్నప్పుడో వాళ్ళు వేసే చమత్కారాలలో నా పెళ్ళి, భార్య, పిల్లల ప్రస్తావన వచ్చినపుడు, అనిపించేది, నా బాధ్యతలను నువ్వూ పంచుకోమంటూ పసుపుతాడుతో బలవంతంగా ఆమె మెడలో కట్టేయాలా అని. పుట్టి ఈ భూమ్మీద మనసున్న జీవిమనిపించుకున్నాకా, మనకు తెలియకుండానే మనసుకు బలంగా కలిగే స్పందనే ప్రేమ. అది ఫలానా సమయంలోనే రావాలని లేదు. కొన్ని సంధర్భాల్లో నాకే తెలీని నిరాశ, నిశ్శత్తువా ఆవరించి నాకంట తడి జారినపుడు అనిపించేది. ఈ క్షణాలను దగ్గరగా పంచుకునే మనసు కావాలని. నా ఆలోచనలు ఆమె మీద ఉండగానే, ముదురు ఆకుపచ్చ చీరలో నవ్వుతూ ఎదురొచ్చింది. మాట కలిపే ధైర్యం చెయ్యలేదుగానీ, తన కళ్ళలో కళ్ళు కలిపాను.

 అది మొదలు సాయంత్రాలు మిల్లు వదలగానే సరాసరి వాళ్ళ ఇంటి సందులో తనకోసం కాపుకాసేవాడిని, నెమ్మదిగా చుట్టరికం కలుపుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళే వాడిని. వాళ్ళ అమ్మ మర్యాదగా పలకరించినా, వాళ్ళ నాన్న మాత్రం అనుమానం కళ్ళతో తడిమేసేవాడు. ఇక ఇంటి వరకూ వెళ్ళడం మానేసి గుడిమలుపులోనే పలకరించే వాడిని. తను ఎక్కువగా మాట్లాడేదికాదు.
ఆరోజు లక్ష్మి మొదటిసారి నాతో పార్కు వరకూ వచ్చింది, నీలిరంగు చీరకట్టి, వాలుజడలో పారిజాతాలు తురిమింది. బొగడ చెట్టు మానుకి జారబడి నాతో మాటాడుతున్నప్పుడు పార్కు దీపం వెలుగు తన ముఖం మీద వింత కాంతిని తెచ్చిపెట్టింది. నిజంగా ఎంత అందగత్తె, ఆ సాయంత్రానికే అందం తెచ్చినట్టనిపించింది. తనూ నేను పక్కపక్కనే కూర్చున్నాం. పార్కులోని నాగమల్లి పూల వాసన ఆ పరిసరాలను మత్తెక్కిస్తుంది. తనని ఆవేళ ఏలా అయినా తాకాలనిపించింది. కానీ నాచేతిలో చెయ్యివేయడానికి కూడా తను జంకింది. వాళ్ళ నాన్న చూస్తాడంది. త్వరగా వెళిపోతానని వాదులాడింది. ఎన్నో ఊసులు చెప్పాలని అనిపించినా నాకూ లోలోపల భయమేసింది. నేనే ప్రతి విషయాన్ని రెండు సార్లు చెపుతూ ఏదో సమయాన్ని నెట్టుకొచ్చాను. తనతో పెద్దగా మాటాడకుండానే సమయం గడిచిపోయింది. ఇలాంటి ఎన్నో రోజులు ఆ పార్కులో తనతో గడిపాను. నెమ్మదిగా మా ఇద్దరి ప్రేమా ఒకరిని విడిచి ఒకరం ఉండలేనంతగా మారిపోయింది. మా సంగతి వాళ్ళ ఇంట్లో చెప్పడానికి భయంగా ఉందని, నన్నే చెప్పమంది.

ఓరోజు వాళ్ళమ్మను కలిసి మా విషయం చెప్పాను. ఆమె సంతోషపడింది. కానీ నా పెద్దవాళ్ళను కలవాలంది. వాళ్ళతో మాట్లాడి అప్పుడు చెపుతానంది. అమ్మ నాకు పెద్ద ఆస్తిని పట్టుకొచ్చే కోడలికోసం చూస్తుంది. ఈ విషయం ముందుగా తనకు చెప్పాలనిపించలేదు. ఇక నాన్న సరేసరి. ముందు తిట్టి తరవాత మాట్లాడతాడు. బాగా ఆలోచించాను. అమ్మానాన్నా తరవాత నాకున్న పెద్ద మావయ్యే. తనకే నా సమస్య చెప్పాలనిపించింది. మావయ్య చెపితే అమ్మానాన్నా వింటారు. ఆలోచన రాగేనే ఆ సాయంత్రమే మావయ్య దగ్గరకు బయలుదేరాను.

*  *  *
సాయంత్రానికి ఊరు చేరుకున్నాను. అత్తయ్యను పలకరించి మావయ్య కొబ్బరితోటలో ఉన్నాడంటే అటుకేసి వెళ్ళాను. నవారుమంచం మీద అడ్డంగా పడుకుని కొబ్బరిచెట్లలోకి చూస్తూ ఏదో ఆలోచనలో ఉన్నాడు మావయ్య. నా అలికిడి విని పక్కకు ఒదిగాడు. నన్ను చూస్తూ పెదాలకన్నా ముందు కళ్ళే పలకరించాయి. ఏరా బాగున్నావా అంటూ..... అచ్చం అమ్మను చూసినట్టే, ఎక్కడా పోలిక తగ్గదు. మునుపు మీద తల మీద జుట్టు బాగా రాలిపోయింది. కాస్త నీరసంగా ఉన్నాడు. మంచంమీద నుండీ లేచి కూర్చుని దగ్గరకు రమ్మని సైగ చేసాడు. తనపక్కనే కూర్చున్నాను.
ఏరా సత్తి... ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా, అమ్మానాన్నా బాగున్నారా.
ఆఆ.... బాగున్నారు మావయ్య.
ఏంట్రా మరీ చిక్కిపోయావ్. పనెక్కువగా ఉంటే మానెయ్ రా.. ఇంకోటి చూసుకుందువు గానీ.
లేదులే, బాగానే ఉంది. ప్రయాణం కదా కాస్త అలసటగా ఉండి....
పొద్దుపోతుంది పద ఇంటికిపోదామ్ అంటూ నా భుజం పట్టుకుని లేచి, భుజం మీద ఉన్న చేతిని బిగించి, ఎప్పుడూ లేంది నన్ను ఆసరాగా నడుస్తున్నాడు. ఏం మావయ్య ఒట్లో బాగాలేదా...అదేం లేదురా బాగున్నాను. కాకపోతే ఇల్లు వదిలి చిన్నిగాడు వెళిపోయాడన్న దిగులు, వరాలు పెళ్ళి బాధ్యత ఇంకా నామీదే ఉన్నదన్న భయం రెండూ కాస్త నిస్సత్తువలోకి నెట్టేస్తున్నాయ్ అంతే.
మాటల్లో ఎక్కడా ఎందుకు వచ్చానో చెప్పలేకపోయాను. మావయ్య దగ్గర అందరికన్నా ఎక్కువ చనువున్నా, ఈమాట చెప్పాలంటే మనసులో దడగా ఉంది. ఎలాగన్నా కాస్త ధైర్యం చేసి రాత్రికి చెప్పాయాలనుకున్నాను. అత్తయ్య కమ్మని భోజనంతో, మావయ్య ఆప్యాయతతో నా కడుపు నిండిపోయింది. రాత్రికి మేడమీద మంచాలు వాల్చుకుని పడుకున్నాం. నెమ్మదిగా మాటల్లో లక్ష్మి గురించి చెప్పుకొచ్చాను. అంతా శాంతంగా విన్నాడు.

అంతా బాగుందిరా... నీకో తోడుని నువ్వే వెతుక్కున్నావ్. నాకు సంతోషమే, కానీ మీ అమ్మ నీమీద చాలా ఆశలే పెట్టుకుందే. దాన్ని ఒప్పించడం అంటే నావల్ల అవుతుందా అని. అదేమిటి..., మావయ్య. అలా అంటావ్. నువ్వు ఏం చెప్పినా వింటారుకదా అమ్మానాన్నా, ఇది మాత్రం వినరంటావా.
కాదురా... ఆదాయం గురించో, వ్యాపారం గురించో మాటాడి సలహాలు ఇవ్వగలను. కానీ బిడ్డల గురించి, వాళ్ళ భవిష్యత్ గురించీ చెపితే ఎవరికైనా, వీడికేం తెలుసు,,, ఎదవ సలహా పాడేస్తాడు అంటారు. ఏ తల్లితండ్రులూ వాళ్ళ బిడ్డలపై పెట్టుకున్న నమ్మకాన్ని, ఆశలను మూడోవాడు పాడుచేస్తుంటే తలవంచుకుని వినరు.
అదికాదు మావయ్య... చిన్నతనం నుండీ నువ్వే నాకు దేవుడివి. నీ నుండే కష్టపడే తత్వాన్ని నేర్చుకున్నాను. పెద్ద కుటుంబాన్ని నీ ఒంటిరెక్కపై ఏలా నెగ్గుకొచ్చిందీ విన్నాను. అదే నాకు ఇప్పుడు నా ఇంటికి దన్నుగా నిలబడేలా చేసింది. ఎంత కష్టమొచ్చినా నిన్ను తలుచుకుని ముందుకెళిపోతాను. నువ్వే నాకోరిక తీరుస్తావని కొండంత ఆశతో వచ్చాను. కాదనకు. నీకన్నా నాకు ఏదీ ఎక్కువ కాదు. అడుగుతానురా... కానీ దీనివల్ల నాబావతో ఎలాంటి పొరపొచ్చాలు వస్తాయో అని భయంగా ఉంది.
ఏం రావులే మావయ్య. నీ మాట అమ్మకన్నా నాన్నే బాగా అర్థం చేసుకుంటాడు.
సరే కానీ... వీలు చూసుకుని రాజమండ్రి వస్తాను. నువ్వు వెళ్ళు.
సరే మావయ్య. నువ్వు మాత్రం ఎప్పుడు వచ్చేదీ నాకు జాబు రాయి.
సరే.
అత్తయ్యతో చెప్పి, తెల్లవారగానే తిరుగు ప్రయాణం అయ్యాను.

* * *

ఊరు నుండీ వచ్చిన దగ్గర నుండీ మిల్లు పని అస్సలు చేయబుద్ది కావడం లేదు. మావయ్య మాటైతే ఇచ్చాడు కానీ, అమ్మను ఏలా ఒప్పించాలి, వాళ్ళ నాన్న, మావయ్య మాట్లాడితే, ఈ పెళ్ళికి ఒప్పుకుంటాడా, ఏమో, నేను ముందు ఏం జరగబోతున్నది ఊహించే శక్తిని కోల్పోతున్నాను. తాతారావు బాబాయ్ నాలోని దిగులుని ఇట్టే కనిపెట్టిన వాడిలా రెండు ఊరడింపు మాటలు చెప్పుకొచ్చాడు గానీ, మాణిక్యానికి నాబాధ మొదటి నుండీ కాస్త చిరాకు తెప్పించేది. లక్ష్మిని కలవడానికి వెళ్ళాలి కాస్త తోడు రమ్మన్నా, మా ప్రేమను గురించి చిన్నగా చెప్పుకొచ్చినా, ముఖం ఏదోలా పెట్టుకునే వాడు. ఎప్పుడూ పని గురించే, మరో సంగతి తలవడు. కొన్నిసార్లు వాడి ప్రవర్తన చూసి, అసలు వీడు మనిషేనా అనిపించేది.

ఓరోజు మధ్యాహ్నం భోజనానికి వచ్చేటప్పటికి అమ్మ దిగులుగా అరుగుమీద కూర్చుని ఉంది. ఏంటని అడక్కముందే నన్ను చూడగానే తన కళ్ళలో నీళ్ళు తిరిగాయ్. విషయం తెలుసుకుని. అటే తమ్ముళ్ళ స్కూలికి వెళ్ళాను. స్కూలుముందు చాలామంది పోగయ్యారు. నాన్న ఎవరితోనో గొడవపడుతున్నాడు. పెద్దగా కేకలు వినిపిస్తున్నాయి. తమ్ముళ్ళిద్దరూ స్కూల్లో పిల్లాడితో గొడవపడి కొట్టారని. వాడికి తలపగిలితే హాస్పిటల్లో చేర్పించారట. పిల్లాడి తండ్రి నాన్నతో గొడవ పడుతున్నాడు. చిన్నన్నయ్య పిల్లాడి నాన్నను కొట్టి కిందపడేయడంతో పిల్లల మధ్య గొడవల్లా పెద్దవాళ్ళకు చేరేసరికి నాలుగింతలైంది. ఊళ్ళో పెద్దలు అంతాకలిసి పోలీసు కేసు లేకుండా, మేము పిల్లాడి తండ్రికి ఐదువేలు రొక్కం ఇచ్చేలా తీర్మానించేరు. ఇప్పుడున్న ఇబ్బందులకు ఇంకోటి వచ్చిచేరింది నా నెత్తిమీదకి.

* * *

ఇక్కడి విషయాలు వివరిస్తూ పరిస్థితి కాస్త చక్క పడ్డాకా మళ్ళీ జాబు రాస్తానని, అప్పుడు రమ్మని మావయ్యకు ఉత్తరం రాసాను. అనుకున్నట్టుగానే ఆ నెలాఖరుకి మావయ్య, అత్తయ్యా వచ్చారు. లక్ష్మి వాళ్ళకు మంచిరోజు చూసుకుని వాళ్ళ ఇంటికి వస్తున్నామని కబురు పంపాడు మావయ్య.

లక్ష్మి వాళ్ళ నాన్న కట్నం ఇవ్వలేమన్నాడు. నగలు కూడా పెట్టలేమని, తమకు ఉన్నదాంట్లోనే పెళ్ళిచేసి పంపుతామనగానే అమ్మ ముఖం రంగు మారింది. టీపాయ్ మీద ఉంచిన టీకప్పులు లోనికి తీసుకువెళుతున్నట్టు దగ్గరగా వచ్చి, లోనికి రమ్మని నాన్నకు సైగ చేసింది. వాళ్ళ మాటలు కాస్త గట్టిగానే హాలులోకి వినిపిస్తున్నాయ్. మావయ్య ఇద్దరినీ బయటకు పిలిచి, అందరి  ఎదురుగానే.....

నీకు వాడిమీద చాలా ఆశలున్నాయని నాకు తెలుసు పార్వతమ్మా.....,
కానీ చిన్నతనం నుండీ కష్టపడడమే గానీ నాకిది కావాలని వాడు మనల్ని అడిగింది లేదు.
మొదటిసారి ఆ అమ్మయితో జీవితం కావాలన్నాడు. మనకు కావలసింది కూడా వాడు బాగుండడమే కదా....
నేను చెప్పానని కాదు, నువ్వు నీ బిడ్డ సుఖాన్ని చూడు. డబ్బుదేముంది. ఇద్దరూ కష్టం తెలిసిన మనుషులు. రెండేళ్ళలో కూడబెట్టుకుంటారు. వాళ్ళు బాగుంటే నువ్వూ బాగుంటావు. అవునా.... ఆలోచించు.

నా వంక చూస్తూ అమ్మ మౌనంగా ఉండిపోయింది. రెండురోజుల్లో తాంబూలాలు పుచ్చుకున్నారు, పెళ్ళికి ముహుర్తాలు ఊరు వెళ్ళాకా, జాతకాలు చూపించి పెట్టిస్తానని మావయ్యా అత్తయ్యా ఊరు బయలుదేరారు.
వాళ్ళను బస్ స్టేండులో దింపుతుంటే మావయ్య ఆప్యాయంగా నన్ను దగ్గరకు తీసుకుని, మా సత్తిగాడు ఓ ఇంటివాడవుతున్నాడు. చాలా ఆనందంగా ఉందిరా. నిన్ను పెళ్ళికొడుకుని చేసి తనివితీరా చూసుకోవాలని ఉంది. కొబ్బరికాయల డబ్బు వచ్చేదాకా ఆగి అప్పుడే పెట్టిస్తాను ముహుర్తం సరేనా.....  అన్నాడు నా ముఖంలోకి చూస్తూ.
చిన్నగా నవ్వాను.

బస్ వచ్చింది. ఇద్దరినీ ఎక్కించి, రోడ్డు వారగా నించున్నాను.
అమ్మాయి జాగ్రత్త... మావయ్య కిటికీ లోంచి చెయ్యి ఊపుతున్నాడు.
చాలాసార్లు, వాళ్ళను దగ్గరుండి ఊరు పంపానేకానీ ఎప్పుడూ ఇంత బెంగగా అనిపించలేదు. నానుండీ ఏదో అవయవాన్ని తెంపి తీసుకుపోతున్నంత బాధ. కళ్ళు చెమ్మగిల్లాయ్. బస్ మలుపు తిరిగేదాకా ఆగి భారంగా సైకిలు ఎక్కాను.

* * *

ఇక రెండు నెలల్లో పెళ్ళి ఉన్నదనగా, ఓరోజు మావయ్య గుండెపోటుతో చనిపోయాడనే వార్త వచ్చింది. నేను విన్నది నిజమేనా, నమ్మలేకపోయాను. గొంతు పొడిబారి, గుండె బరువెక్కిపోయింది. అమ్మయితే ఉన్నచోటే కూలబడిపోయింది. మావయ్య ఇంత అన్యాయం చేస్తాడనుకోలేదు. మేమంతా ఊరు చేరేసరికి మధ్యాహ్నం అయింది. ఆకాశం మబ్బుపట్టి ఉంది.గుమ్మం ముందు రిక్షా దిగేసరికి, ఊళ్ళో పెద్దలంతా వాకిట్లో గుమిగూడి ఉన్నారు. పెంకుటిల్లు వసారాలో నవారు మంచం మీద పడుకుని ఉన్నాడు మావయ్య. తలదగ్గర గోడకి రాములవారి పటం కళతప్పి ఉంది. ప్రపంచంలోని శాంతినంతా తన ముఖంలో నింపుకుని ప్రేమ మూర్తిలా, మరో లోకాన్ని చూసిరావడానికి బయలుదేరి వెళ్ళాడు మావయ్య. అస్సలు శవాన్ని చూస్తున్నట్టుగా అనిపించ లేదు నాకు.

మమ్మల్ని చూడగానే అత్తయ్య గట్టిగా ఏడుస్తూ, అమ్మను పట్టుకుని తన ఒడిలోకి జారిపోయింది. మావయ్య కూతురు వరాలు జరుగుతున్నదంతా మౌనంగా చూస్తూ ఉండిపోయింది. ఏవో ఆలోచనలు, ఆ పరిసరాలనుండీ బయటకు తీసుకువస్తూ, లేదు ఇంకా తన కొబ్బరితోటలో మావయ్య ఉన్నాడన్న భ్రమను కలిగిస్తున్నాయ్. నామెదడు లోపల వేయి తలలు తమ మెదళ్ళతో ఆలోచిస్తున్నట్టుగా ఉంది. ఎందుకు ఇంత అన్యాయం చేసావు మావయ్య, నన్ను ఒంటరిని చేసేసావ్, ఏడవాలన్నా కన్నీళ్ళు రావడంలేదు. తలకొరివి పెట్టేందుకు కన్న కొడుకు కూడా దగ్గరలేని చావు వచ్చిందని వచ్చినవారంతా గుసలాడుకుంటున్నారు. కబురుపంపాలన్నా చిన్నిగాడు ఎక్కడ ఉన్నదీ తెలీదు. చుట్టాలంతా జరగవలసిన కార్యక్రమం చూడమంటూ తొందర చేస్తున్నారు. చీకటిపడక ముందే శవాన్ని మావయ్యకు ఇష్టమైన కొబ్బరితోటలోనే నా చేతుల మీదుగా అంత్యక్రియలు జరిగాయి.

        *  *  *

మావయ్య లేడన్న నిజాన్ని నమ్మడంలో చూస్తుండగానే సంవత్సరం గడిచిపోయింది. నాకూ పెళ్ళి సంగతి గుర్తులేకుండా పోయింది. ఏదో మనసు మరీ మెలిపెట్టినప్పుడు లక్ష్మిని చూసి వచ్చేవాడిని. తను కూడా నాతో పెళ్ళి ప్రస్తావన తీసుకువచ్చేది కాదు.ఓరోజు లక్ష్మి, తన చెల్లెలితో మిల్లు దగ్గరకి కబురు పంపింది. తనకి వేరే సంబంధాలు చూస్తున్నారు. వాళ్ళ నాన్నను కలిసి మాట్లాడమని. నేను వెళ్ళి గట్టిగా వాళ్ళ నాన్నను అడిగితే,మాకు డబ్బులేదు, మీకూ డబ్బులేదు. మీ మావయ్య బ్రతికుండగా అనుకున్న మాట. ఆయన పోయికా, ఇంతకాలంగా ఒక్కరన్నా పెళ్ళి సంగతి ఎత్తారా? పెళ్ళి కుదిరి సంవత్సరం అవుతుంది ఎప్పుడు పెట్టిస్తారు పప్పన్నం అని అందరూ అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నాను. అందుకే వేరే సంబంధాలు చూస్తున్నాను అన్నాడు.

రెండురోజుల్లో మావాళ్ళను తీసుకుని వస్తానని లక్ష్మి వాళ్ళమ్మతో చెప్పి ఇంటికి వచ్చేసాను. అమ్మనాన్నకు జరిగిందంతా చెప్పాను. అమ్మనాన్నా లక్ష్మివాళ్ళతో మాట్లాడి, మావయ్య ఇచ్చిన మాట ప్రకారమే కానీ కట్నం తీసుకోకుండా, లక్ష్మిని కోడలిగా చేసుకుంటామని ముహుర్తాలు పెట్టించారు. అలా 1982 ఫిబ్రవరి 18 మా పెళ్ళి జరిగింది.

తొలిసూరు ఆడపిల్ల పుట్టింది. మావయ్య పేరు కలిసేలా ద్రాక్షాయణి అని పేరు పెట్టుకున్నాను. ఎన్నాళ్ళు రంగులేయడమని, నన్ను, మాణిక్యాన్ని సీనియర్ దగ్గర స్ర్కీన్ ఫ్రింటింగ్ లో చేర్చాడు అప్పారావు బాబాయ్. ఇప్పుడు ఆదాయం కాస్త పెరిగినా, ఖర్చులు అంతకన్నా ఎక్కువే అయ్యాయి.


*

 తరువాయి భాగం వచ్చేవారం...







Tuesday, 2 January 2018

చిన్న చిన్న ఫీలింగ్...





ఈ బ్లాగు లో రాయాలన్న ఆలోచన మనసుకి దగ్గరగా వచ్చింది చాలా తక్కువసార్లు..ఏం రాయాలన్నా ఏదో ముహుర్తం పెట్టుకుని రాద్దామన్న తంతే గానీ.. రాసి తీరాలన్న ఆత్రం తక్కువే.. ఒక్కోసారి రాయాలనుకున్నదంతా కాగితం మీద పెట్టకమునుపే ఆలోచనల్లో కరిగి నీరైపోతుంది. మరోసారి రాసిన కాగితం మీది అక్షరాలు చదువుకునే లోపు, తిరిగి నన్ను ఎక్కిరిస్తాయి. ఇదేనా రాసేది.. మనసెక్కడ పెట్టావ్ అంటూ....

ఈ గొడవ తేల్చుకునేలోపు మళ్ళీ ఏదో హైరానాలో పడి నన్ను నేను పూర్తిగా మరిచిపోతాను. ఎక్కడా క్షణం తీరిక లేని వ్యవహారాలు నడిపేస్తున్న ఫీలింగ్. అంతే ఇది ఉత్త ఫీలింగ్  మాత్రమే... ఏదో సామెత చెప్పినట్టు... దమ్మిడీ ఆదాయం లేదు... పైసా ఉపయోగంలేదు. ఏదో సామెత సరిగా గుర్తు రావడం లేదు. దానికోసం ఆలోచించేలోపు ఇదిగో ఏదో రాద్దామనుకున్న ఈ ఫీలింగ్ మళ్ళీ కరిగి గాల్లోనే నీరైపోతుంది.

ఏదైనా రాయాలంటే పట్టుగా ఏదోటి చదవాలికదా... మరి చదవడం లేదే... రోజూ.. కానీ రాస్తున్నాను. అవన్నీ ఉద్యోగానికి నేను చేసిపెట్టే రాతలు. అవి నావి కావనిపిస్తాయి. ఏదో ఎత్తుకొచ్చిన ఫీలింగ్.. నేను రాసానని ఇది నాదేనని గట్టిగా చెప్పి ఈ పవిత్రమైన బ్లాగులో వేసుకోలేను.

ఇక్కడి ప్రతి అక్షరం నా మట్టి బుర్రలో పుట్టి పురుడు పోసుకున్నదే..అందుకే నాకు ఈ బ్లాగు అంతిష్టం. ఇక్కడ నాకు మాత్రమే చెందిన ఆలోచనలు ఉంటాయి. సరే అసలు విషయానికి వస్తాను. ఇప్పుడు చేస్తున్న ఉద్యోగంలో నాకంటూ కాస్త సమయం దొరికింది. రాసుకోగలను. ఇన్నాళ్ళుగా రాయలేని రాతలన్నీ ఇప్పుడు రాసుకోవాలని చిన్న ఆశ. మీకు ఇక నుండీ టచ్ లో ఉంటాను లెండి.

మరి నా రాతలు చదువుతారు కదా.. ఈ బుద్ది బుధవారం వరకూ ఉంటే చూద్దాంలే అనుకుంటే నేనేం చేయలేను. అంతే...


నీలోకి ఒలికిపోయాననీ..

ఈరోజుకి రాసే ప్రేమలేఖ ఇది..  కొన్నిసార్లు అనిపిస్తుంది.  నేను నీలోకి ఒలికిపోయాననీ..  నీలోకి వచ్చి చేరాకా హృదయంలోని నిశ్శబ్దానికి...