బిడ్డను పోగొట్టుకోవడం అన్నది ఓ శాపం. చెట్టుకు వచ్చిన పిందెలన్నీ నిలవనట్టే పుట్టిన బిడ్డలందరూ నూరేళ్ళు ఉండాలని లేదు. కానీ కలనైనా తన బిడ్డలు దీర్ఘాయువుతో ఉండాలనే కోరుకుంటుంది ప్రతి తల్లీ. విధి మోసం చేసినప్పుడు. తన బిడ్డను ఎత్తుకుపోయినప్పుడు. ఆమెకు మిగిలేది మరో ప్రపంచమే. తను తప్ప ఎవరూలేని ప్రపంచం. ఈ ప్రపంచాన్ని, ఈ బాధను నేను ఇంతకముందు ఎరిగి ఉన్నాను కనుక ఈకథ నన్ను చాలా సులువుగా తనలోనికి లాగేసుకోగలిగింది.
“బదిలీ” ఇది కథకాదు. ఓ అమ్మ ఆక్రోశం. ఆమె పోగొట్టుకున్న బిడ్డకోసం పడే వేదన. ఆమెకు మాత్రమే సొంతమైన ప్రపంచానికి కాసేపు మనల్నీ తీసుకువెళ్ళి తన కథ చెప్పి, తిరిగి పంపేస్తుంది. ఆమెతో పాటుగా ఆ కథలోకి వెళ్ళినప్పుడు కన్నీరు ఎప్పుడు నాకళ్ళలో పుట్టి చెంపల మీదుగా జారిందో గమనించనేలేదు నేను. అలా వెళ్ళడం ఒక్కటే నా చేతుల్లో ఉంది. కథ చదవడం పూర్తి కాగానే నేను ఎంత బలంగా ప్రయత్నించినా అణువంతైనా ఈ కథ తప్ప మరోటి ఆలోచించలేని స్థితికి వచ్చేసాను. ఏదో బాధ. అందులోంచి కథలో ఉన్న సారాంశం అంతాపట్టుకుని ఆలోచించే శక్తిని కోల్పోయాను అనిపిస్తుంది. నన్ను పట్టి ఆపేసింది. ఆ తల్లీ బిడ్డలే. వారే ఉన్నారు నేను చదివిన, నాకు అర్థమైన చోటల్లా.
కొన్ని కథలు, అందులోని పాత్రలు మనల్ని వెంటాడటం మామూలే, కానీ అదే కథ నీ జీవితంలో జరిగి, నీకూ ఆ బాధ తెలిసినప్పుడు అప్పుడు నీ మానసిక స్థితి ఏలా ఉందో రచయిత(త్రి) కచ్చితంగా చెప్పగలగటం ఓ అద్భుతమే.
రచయిత్రి ఆర్. వసుంధరా దేవి గారు రాసిన ఈ “బదిలీ” కథ ఓ తల్లి బిడ్డను పోగొట్టుకున్నప్పుడు ఆమె అనుభవించే మానసిక స్థితి. మిగతా కథంతా కొత్తగా ఏం అనిపించలేదు. పట్టలేనంత బాధను భరించాల్సి వచ్చినప్పుడు, తన చుట్టూ ఉన్నవారు ఆ బాధను పంచుకోనప్పుడు ఆమె పడే వేదన అక్షరాల్లో వర్ణించలేనిది. ఎవరు మరిచిపోయినా ఆ బాధను తల్లి మాత్రం ఎప్పటికీ మరువలేదు.
ఒక కోట్ : నాకు ప్రపంచం లేదు. బదిలీ అయిపోయింది. నాలోకి బదిలీ అయిపోయింది. ఇప్పుడు నేనే ప్రపంచాన్ని.