మా సుబ్బయ్యగారింట్లో దొంగలు పడ్డారు.

ఓ పక్కగా తెల్లారిందో లేదో ఈ వార్త వినగానే ఉలిక్కిపడ్డారు పెద్దోళ్ళంతా. పొద్దున్నే ఊడ్చి , కళ్ళాపి జల్లి , పొయ్యిలెలిగించే ఆడాళ్ళయితే , జుట్టుముడి ఊడిపోయినా పట్టించుకోకుండా ఓ గుంపుగా చేరిపోయి ఆ గొడవే మాట్లాడేసుకుంటున్నారు. “ అయ్యో పాపం ఇరవైతులాల బంగారం , నలభై వేలరూపాయల సొమ్మూ ఎత్తుకుపోయారంట. ఇంకా ఏం ఎత్తుకుపోయారోనమ్మా సచ్చినోళ్ళు ” “ సుబ్బయ్యగారు బాగానే సంపాదించాడులే , పార్వతమ్మ ఓ వెలుగు వెలిగింది. అంతా పోయే ఉంటాది. ” “ పోతేపోయింది రేపట్నుండి మనల్ని అప్పులడగకుండా ఉంటే నయ్యం ” అంటూ మూతులు తిప్పుకుంటా , మనకెందుకొచ్చిన గొడవలే అంటా సాగదీసుకుంటున్నారు. ఇక మగాళ్ళయితే పంచలెగ్గట్టి ఒకరి తరువాత ఒకరు రచ్చబండ మీద మీటింగులెట్టేసారు. “ పాపం సుబ్బయ్యగారు ఎంత దజ్జాగా ఉండేవోడు. యాభై తులాల బంగారం , లక్షరూపాల సొమ్మూ ఎత్తుకుపోయారంట. ఇకపోయిన సొమ్ముతోనే ఆయన దజ్జాకూడా పోయినట్టేరా ఎంత కష్టం వచ్చింది ఆ కుటుంబానికి ” అనుకుంటూ తెచ్చిపెట్టుకున్న బాధతో తెగ జాలిపడిపోతున్నారు. తెల్లారినంతనే ఏదో ఉపద్రవం వచ్చిపడిపోయి ఆరోజు బడి ఎగ్గొట్టేయాలని రాత్రే దేవుడికి తెగ దండాలెట్టేసి పడుకున్...