ఈ మీసాలోడు నిజంగా ఉన్నాడు. చిన్నప్పుడు మా ఇంటి ఎదురుగా ఉండేవాడు. కథలో జరిగిన చాలా విషయాలు నిజంగా జరిగినవే. మరీ కథలో అంత కాదు గానీ, మా అమ్మ కూడా అంతే. ఇలా నాకు ముఖపరిచయం మాత్రమే ఉన్న మీసాలోడు ఒక కథగా మారతాడని అంతకుముందెప్పుడూ అనుకోలేదు. అతని హత్య జరిగిన తర్వాత నిజంగానే నేను కథలో జరిగినట్టే ఫీలయ్యాను. కథని మగ పాత్రతో ఎందుకు చెప్పించానో నాకూ తెలీదు. కథ చదివి మీ అభిప్రాయం చెప్తే సంతోషిస్తాను.
తెల్లవారుజాము నాలుగున్నరకు నాగదిలో అలారం మోగింది. అప్పటికే కలతనిద్రలో ఉన్నానేమో ఆ మోతతో మెలుకవ వచ్చేసింది. ఓ సంవత్సరంగా నాకు ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది లెండి. అంటే నావయసు ఏ అరవయ్యో అనుకునేరు, ముప్ఫయ్యే. ఇంకా పెళ్ళి కాలేదు. కోడలు రావాలని అమ్మకు ఎంత ఉన్నా, నాకు మాత్రం ఈ బ్రహ్మచారి జీవితమే బాగుంది. ఏదో వంకచెప్పి ఇంకొన్ని రోజులు ఇలా కానిచ్చేద్దామనే ఉంది.
ఈ మధ్య నేనూ – నా ఆరోగ్యం అనే ప్రాతిపదికన రోజూ ఉదయాన్నే వాకింగ్ మొదలెట్టాను. ఆరోగ్యం సంగతి ఎలా ఉన్నా నడక తరువాత అలసిన శరీరానికి చక్కని వేడినీటి స్నానం, మంచి ఫలహారం తరువాత పట్టే నిద్ర ఉంది చూసారూ ఆ సౌఖ్యాన్ని వర్ణించడం కష్టమండీ.
పగలు, రాత్రి తేడా లేకుండా వాహనాలు పోయే రోడ్ల మీద కాకుండా నా నడకను మా ఇంటి నుండీ ఓ మైలు దూరంలో ఉన్న జనచైతన్యా హౌసింగ్ బోర్డు వాళ్ల స్థలాల్లో చేస్తాను. ఆ స్థలాలు పదమూడు ఎకరాల్లో ఉన్నాయి. ఎర్రమట్టితో రోడ్డు వేసి ఫ్లాట్లుగా విడగొట్టారు. ఆ దారంతా ఉదయం, రాత్రి సమయాల్లో పెద్దగా జనసంచారం ఉండదు. మిగిలిన సమయాల్లో బండి మీద పోయేవాళ్లు ఈ మార్గం గుండా మాధవపట్నం వెళతారు. ఉదయం మంచుపడే వేళల్లో అలా నడుచుకుంటూ పోతే ప్రశాంతంగా ఉంటుంది. రోజూలానే నా ఉదయపు నడకకు కావలసిన కవచాలు ధరించి ఇంటి నుండి బయలుదేరాను.
ఈ స్థలాల పొలిమేరను ఆనుకుని రైల్వే ట్రాక్ వెళ్తుంది. అటూ ఇటూ ముళ్ల కంపలు ఉంటాయి. అక్కడ కొందరు గుంపుగా నిలబడి తుప్పల మధ్యకు చూస్తూ వాళ్లల్లో వాళ్లే మాట్లాకుంటున్నారు. నేను నడకవేగాన్ని పెంచి వాళ్లను చేరుకున్నాను. రోడ్డుకు వారగా ఉన్న తుప్పల మధ్య ఓ శవం. దానికి కొద్ది దూరంలో బైకు పడి ఉన్నాయి. ఆ ప్రదేశం చుట్టూ పెద్దగా ఘర్షణ జరగిన ఆనవాళ్ళున్నాయి. ఇక పోలీసులు రావడం ఒక్కటే తరువాయి.
ఆ బైకును చూస్తే చాలు ముఖం చూసి గుర్తు పట్టనవసరం లేకుండానే మనిషి ఎవరన్నదీ అక్కడ వున్న వాళ్లందరికీ అర్థమైపోయింది. అది మా మీసాలోడి బైకు. అవును మేమంతా – అంటే నాలాంటి వయసులో ఉన్న అబ్బాయిలంతా వాణ్ణి హీరో అనుకుంటే (ఆకారానికి మాత్రమే), పెద్దాళ్ళంతా విలన్ అంటారు. ఆరడుగుల పొడవుతో, పొడవుకు తగ్గ లావుపాటి శరీరంతో ఉంటాడు. నల్లని బుర్రమీసాలతో రాజకీయ నాయకుడిలా ఖద్దరు బట్టలు కడతాడు. చేతికి తనకు తగ్గట్టే పెద్దసైజు వాచీ, సెల్ ఫోన్ వెరసి ఆకారం మొత్తం యముడిలా ఉంటుంది. యముడి దున్నపోతు మాదిరిగా వీడు రెండు వీధుల అవతల ఉండగానే పెద్దగా మోత చేస్తూ అందరి గుండెల్లో గుబులు పుట్టిస్తుందా బైకు. వాడు వీధి దాటగానే గాలిలో ముక్కులు పగిలేలా సెంటువాసనా.
నేను పైకి గొప్పగా చెపుతున్నాకానీ ఇక్కడ వున్న వాళ్ళంతా తమ మనసుల్లో చాలా సంబరపడిపోతున్నారు. మనిషి చస్తే సంబరమేంటా అనుకుంటున్నారా. చచ్చినవాడు అపర కర్ణుడేం కాదు. ఆకారం బాగున్నా వీడికి వికారాలు ఎక్కువే. వీడి గురించి నాకు తెలిసింది చెపుతాను.
మనిషి రక్తాన్ని దోమ తొండంతో తాగితే వీడు వడ్డీల రూపంలో తాగేస్తాడు. అప్పుకోసం మీసాలోడి గుమ్మం తొక్కినవాళ్ళకు ఈ జన్మకు ముక్తి ఉండదనేది జగమెరిగిన సత్యం. కానీ అవసరం వాడి గుమ్మం ఎక్కేలా చేస్తుంది మరి. మీసాలోడికి పిల్లల్లేరు. భార్య‘లు’ ఉన్నారు. రాంబాబు అనే తమ్ముడున్నాడు. పైకి వీళ్లు రామలక్ష్మణులే కానీ, వాలి సుగ్రీవుల్లా వాళ్ళల్లో వాళ్లకు పడి చావదు.
మీసాలోడి గురించి నాకు అందరికన్నా కాస్త ఎక్కువే తెలుసు. అంటే నేను వాడి అనుచరుణ్ణి అనుకునేరు! ఐదేళ్ళ కిందట ఓ శుభముహర్తాన మా ఇంటికి ఎదురుగా ఉన్న బంగళాలోనికి మీసాలోడు సతీ సమేతంగా (ఎన్నో భార్యో నంబరు తెలీదు) అన్ని హంగులతో అద్దెకు దిగాడు. ఆమె పేరు శకుంతల, మీసాలోడి ఒడ్డూ పొడవుకు తగ్గట్టూ ఉంటుంది. వయసు మరీ చిన్నదేంకాదు. నలభై ఉంటాయి. అలంకారంతో ఆ వయసు బైట పడకూడదని తెగతాపత్రయ పడుతుంది. ఇరుగుపొరుగు ఆడవాళ్ళతో డాంబికాలు పోతూ, మొగుణ్ణి తెగపొగిడేస్తుంది.
మీసాలోడి వడ్డీవ్యాపారం, రియలెస్టేటు, బిజినెస్ సెటిల్మెంట్స్, మిగతా వ్యవహారాలన్నీ ఈ ఇంటి నుండే జరిగేవి. వచ్చే జనం పోయేజనంతో ఎప్పుడూ ఆ ఇల్లు కోలాహలంగా ఉండేది. నేను ఇదంతా మా మేడ మీద పచార్లు చేస్తూ గమనించేవాణ్ణి. అప్పుడప్పుడూ మా ఇంటి పిట్టగోడ మీంచి చూసేవాణ్ణి. ఇందులో ఎలాంటి చెడ్డ ఆలోచనా లేదండీ. మీసాలోడు చెడ్డోడని తెలిసినా వాడికున్న ఫాలోయింగ్ నాకు నచ్చేది. మా వీధిలో పెద్ద దుకాణం ముందు నాలాంటి కుర్రకారంతా చేరి వాడి గురించే మాట్లాడుకునేవారు.
వడ్డీకి డబ్బులివడం, చక్రవడ్డీలూ బారువడ్డీలూ వేయడం, అవి సమయానికి రాకపోతే మనుషులతో బెదిరించి వసూలుచేయడం… ఇలా వచ్చిన ఐదేళ్ళల్లోనూ అందరి ఉసురూ పోసుకుని బాగానే పేరూ, డబ్బూ సంపాదించాడు. మీసాలోడు చచ్చాడంటే అప్పులు తీసుకున్నవాళ్ళంతా పీడా పోయిందని తీసుకున్న డబ్బు కట్టనవసరం లేదని లోలోపల తెగ సంబరపడిపోతున్నారు. నాకూ వాడికీ ఎలాంటి రుణబంధమూ లేదు కాబట్టి మీసాలోడు నా వరకూ హీరోనే. ఈ హత్యకు ముందురోజే అతన్ని హైవే మీద చూసాను. నన్ను గుర్తుపట్టినట్టు నవ్వాడు కూడా, ఏది ఏమైనా నా కళ్ళముందు ఇంకా ఆ మీసాలోడు తన బైక్ మీద తిరుగుతున్నట్టే ఉంది.
* * *
అప్పుడే ఈ వార్త ఊరంతా తెలిసిపోయింది. కొందరు సంతోషిస్తే, కొందరు అయ్యో అన్నారు. బ్రిడ్జి దగ్గర గుమికూడిన మా కుర్రాళ్ళమందరం అలాంటోడు మళ్ళీ పుట్టడురా వాడి దర్పం, ఆ ఠీవీ ఎవరికీ రావు అంటూ తెగ బాధ పడిపోయాం. హత్యాస్థలానికి కాస్తదూరంలో ఉండి జరిగేదంతా చూస్తూ నిలబడిపోయాం. మధ్యాహ్నానికి శవపంచనామా అదీ పూర్తయి శవాన్ని పోలీసులు స్వాధీన పరుచుకుని, మొదటగా చూసిన వారినందరినీ యక్షప్రశ్నలూ వేసి వదిలారు.
అంతా ఎవరి ఇళ్ళకు వాళ్ళు బరువైన హృదయాలతో బయలుదేరాం. ఎందుకో మనసంతా మీసాలోడి ఆలోచనలతో గందరగొళంగా ఉంది.
* * *
ఇంటికి రాగానే మా అమ్మ తెగబాధపడిపోతూ నాకు ఎదురొచ్చింది. “విన్నావారా మీసాలోడిని ఎవరో హత్య చేసారట పాపం,” అంటూ తన ధోరణిలో తను ఆ వివరాలు చెపుతుంది. ఇక్కడ మా అమ్మ గురించి మీకు ఓ విషయం చెప్పాలి, ఉదయాన్నే పెద్ద పనున్నట్టు లేచిపోయి కాలకృత్యాలు తీర్చుకుని టీ తాగుతూ టీవీ ముందు వాలిపోతుంది. ఆ ఇది పెద్ద విషయమా అంటారా… అలా కాదండీ బాబు! ఈ కాలంలో అందరి ఆడవాళ్ళలా సీరియళ్ళు తెగపిచ్చిగా చూస్తూ ఇంటి సంగతీ, వంట సంగతీ, ఒంటి సంగతీ మరిచిపోతే పరవాలేదు. వాళ్ళందరికీ కాస్త భిన్నం మా అమ్మ. ఎలాగంటారా.
మాములుగా మనం అందరం ఈనాడు పేపరులో జిల్లా ఎడిషన్ ఓసారి చూసి చదవడానికి తెగ ఇబ్బంది పడిపోతాం, ఉదయాన్నే ఈ పాడు చావు వార్తలెందుకులే అనుకుంటూ పక్క పేజీకి పోతాం. టీవీలో చావు న్యూస్ చూసినా అంతే తీరుగా కాస్త చూసి పక్క ఛానల్ మార్చేస్తాం. కానీ అమ్మ అలా కాదు ఉదయాన్నే టీ తాగుతూ కేబుల్ కనెక్షన్ సౌజన్యంతో టీవీ9 వారి నిరంతరంగా ప్రసారమయ్యే క్రెం న్యూసునూ, వాడు తిప్పి తిప్పి చూపించే స్క్రోలింగులనూ చదువుతూ ఆ హత్యల గురించి తెగ ఫీలయిపోతుంది. ఇది కూడా పెద్దగా అభ్యంతరం కాదు, ఆవిడ ఓపిక. కానీ ఆవిడకు ఉదయాన్నే దొరికిన వాళ్లందరి మీదా – అంటే ఇంట్లో మా అందరి మీదా ఆ వార్తల ప్రభావం పడుతుంది (ముఖ్యంగా నాన్నగారు ముందుగా బలైపోతారు, ఆ తరువాత మేము). అదెలాగంటే.
ఏదో సినిమాలో శ్రీలక్ష్మి ఆగకుండా పాలవాడికీ, పూలవాడికీ తాను చూసిన సినిమాల గురించి టైటిల్స్ నుండీ శుభం కార్డు వరకూ చెప్పినట్టు మా అమ్మ కూడా టీవీలో ఓ హత్య వార్త చూసి అది ఎలా జరిగిందో దాన్ని ఎవరు చేసి ఉంటారో అసలు ఆ హత్య జరగడానికి కారణాలు అన్నీ తన ఇంటిలిజెంట్ బుర్రతో ఆలోచిస్తూ దొరికిన వారి ప్రాణాలు తీసేస్తుంది. అక్కడితో ఆగదు, ఆ వార్తని బుర్రలో ఫీడ్ చేసేసుకుంటుంది, నాలుగు రోజుల వరకూ పోలీసులు హంతకుణ్ణి కనుక్కున్నారా లేదా అంటూ అన్ని ఛానళ్ళూ వెతుకుతుంది. ఏదో వాళ్ళ కర్మ కాలి (మాది కూడా) పోలీసులు పట్టుకోకపోతే మా అమ్మ నోటి నుండి వచ్చే “ఎర్ర అక్షరాలు” (అవే నండీ తిట్లు) ప్రవాహంలా తనంతట తాను ఆ వార్త మరిచిపోయే వరకూ పారుతూనే ఉంటాయి.
ఆ మధ్య “నేరాలూ ఘోరాలు” గోంగూరా అంటూ వచ్చిన ప్రోగ్రాంను ఆదర్శంగా తీసుకుని ఈ వార్తలు చూపించే చానళ్ళు ఎక్కువయ్యాయి. హత్య ఎలా చేసారు, ఏ ఆధారాలు వదలడంతో దొరికిపోయారు అంటూ చూపించడం వచ్చాకా మా పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారయింది. “కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడినట్టు” తయారయింది మా పని.
ఆవిడ మాటలు వినపడనట్టు నా రూంలోకి వెళిపోయాను. రెండు రోజులు గడిచాయి. అందరి మనసుల్లోనూ ఈ హత్య మరుగున పడిపోయింది. నేను మళ్ళీ నా ఉదయపు నడకను కొనసాగించాను. హత్య జరిగిన ప్రదేశం సమీపించగానే ఒక్కసారిగా గంభీరమైన మీసాలోడి ముఖం నా కళ్ళ ముందు తెరలా కనిపించి మాయమయ్యేది.
మూడోరోజు సాయంత్రం మా ఇంటి ముందు పోలీసు వ్యాను ఆగింది. అందులోనుండీ ముగ్గురు మఫ్టీలో ఉన్న పోలీసులు దిగి సరాసరి మా ఇంటి ముందుగది లోకి వచ్చేసారు. అప్పటి వరకూ సీరియస్ గా క్రైం వార్తలు చూస్తున్న అమ్మ ఒక్కసారిగా కంగారుపడి గదిలోకి పరిగెత్తుకు వచ్చింది. నాకూ విషయం అర్థంకాలేదు. కాస్త కంగారూ వేసింది.
అసలు సంగతేంటంటే, పోలీసుల మాటల్ని బట్టి వాళ్ళు మా అమ్మ కోసం వచ్చారని అర్థం అయ్యింది. నా గుండెల్లో ఒక్కసారిగా సినిమాలో చూపించినట్టు అగ్ని పర్వతం బద్దలైంది. ఈవిడ హత్య కేసులు తేలకపోతే పోలీసుల్ని నోటికొచ్చిన బండబూతులన్నీ తిడుతుందని గిట్టని వాళ్ళు రిపోర్టు చేయలేదుకదా అనుకుంటూ వాళ్ళ ముందుకు వెళ్ళి నుంచున్నాను. సమయానికి నాన్నగారు కూడా ఊళ్ళో లేరు. అందరికీ నమస్కారం పెట్టాను.
నన్ను చూడగానే హెడ్డు “మీ అమ్మగారిని రేపు ఓసారి పోలీస్ స్టేషన్ కి తీసుకురమ్మని ఎస్.ఐ గారు చెప్పమన్నారండి” అన్నాడు.
చచ్చాం అనుకున్నంతా అయ్యింది. ఇప్పుడెలారా దేవుడా అనుకుంటూ వాళ్ళను చూడగానే పూడుకుపోయిన నా గొంతు పెగిల్చి “ఎందుకండీ మా అమ్మ ఏం చేసారు” అన్నాను అతి కష్టం మీద.
“ఏ సంగతీ మీరు ఎస్.ఐ గారినే అడగండి” అన్నాడు బొంగురు గొంతుతో. “రేపు ఉదయం తీసుకురండీ” అంటూ వచ్చినంత వేగం గానూ వెళిపోయారు.
అమ్మ మీద ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఏం తెచ్చి పెట్టిందో, అసలు ఏం జరుగుతుందో తెలియక నా కోపం నషాళానికి అంటింది. అమ్మను తిడదామని ఆమె వైపు చూద్దును కదా గోడకు కొట్టిన పిడకలా గట్టిగా అత్తుక్కుపోయింది.
నాన్నకు ఫోన్ చేసి చెప్పాను. ఆయన సాయంత్రానికి ఇల్లు చేరుకున్నారు. అసలే బెదిరిపోయిన అమ్మను నాన్న వచ్చే వరకూ ఏం ప్రశ్నలు వేయలేదు. ఒక్కసారిగా భయంతో జ్వరం తెచ్చుకుని మంచమెక్కేసింది.
అసలు ఏం జరిగిందో నెమ్మదిగా నాన్ననే కనుక్కోమన్నాను. “అడిగాన్రా అసలు అది ఏం ఎరగనంటుంది” అన్నారు. సాయంకాలం దాకా బాగా ఆలోచించాకా నాకు ఓ విషయం తట్టింది. రాత్రికి నెమ్మదిగా అమ్మనడిగి నాకు వచ్చిన అనుమానాన్ని రూఢీ చేసుకున్నాను.
రెండు రోజుల క్రితం మీసాలోడి హత్య జరిగాక మా కాలనీ ఆడాళ్ళంతా శకుంతలను పరామర్శించడానికి వాళ్ళింటికెళ్ళారు. అందరితో మా అమ్మ కూడా వెళ్ళింది (కాస్త కుతూహలంతో). అందరూ మాట్లాడటం అయ్యాకా, మా అమ్మ కూడా తన ధోరణిలో ఓదార్పు మాటలకు బదులు పెద్ద నేర పరిశోధనా నిపుణురాలిలా, “అసలు హత్య రాత్రి 8 నుండి 9 గంటల మధ్య జరిగి ఉండాలి. మీతో ఆఖరుగా 7.30కి మాట్లాడారన్నారు. చివరిసారిగా ఆయన్ను చూసింది నేనే అయితే. ఆయన నిన్న 7.45 నిముషాలకు హైవే మీదుగా వెళుతూ కనిపిచారు. అంటే ఈ మధ్యలోనే ఎవరో తెలిసివాళ్ళే జనచైతన్యా మార్గంలో కాపు కాసి హత్య చేసి ఉండాలి” అన్నదట.
అంతే ఆ మాటలు విన్న శకుంతల పోలీసులకు ప్రత్యక్షసాక్షిగా మా అమ్మ పేరు చెప్పింది.
అదీ నిజమే చివరగా చూసింది మేమిద్దరమే. తీగ లాగితే డొకంతా కదిలినట్టు ఎందుకొచ్చిన గొడవ అనుకుని ముందు ఈ వ్యవహారంలో నుండి అమ్మని బయటపడేయటం ఎలాగో ఆలోచించాను. నాన్నగారికి జరిగిన విషయం చెప్పాను. ఇద్దరం ఉదయాన్నే ఎస్.ఐని కలిసి అమ్మకు మతి స్థిమితం సరిగా లేదని చెప్పి, అనవసరంగా ఈ విషయంలోకి లాగద్దని బతిమాలి చేతులు తడిపి ఎలాగో అక్కడి నుండి బయటపడ్డాం.
* * *
దాదాపుగా సంవత్సరం కావస్తుంది మీసాలోడు పోయి. బాకీ తీర్చనవసరం లేదని సంబర పడినంత సేపు లేకుండా పోయింది మా ఊరోళ్ళకు. వడ్డీల బకాసురుడు పోయాడనుకున్న నెలకు వాడి తమ్ముడు ఆ స్థానాన్ని బర్తీ చేసాడు. ఇక మీసాలోడిని ఎవరు చంపించారో అందరికీ తెలిసినా ప్రజలంతా భయం వల్ల, పోలీసులు డబ్బువల్ల నోరు తెరవలేదు.
మా ఇంటి విషయానికి వస్తే ఇప్పుడు మా అమ్మ ఉదయాన్నే క్రైం వార్తలు చూడటం మానేసి పూజ గదిలోనే ఎక్కువ సమయం గడుపుతుంది.
*
శ్రీశాంతి దుగ్గిరాల
Hha..hha..chaalaa baagundi srisanthi gaaru:):)
ReplyDeleteకథ మీకు నచ్చినందుకు ధన్యవాదాలు కార్తిక్ గారు.
ReplyDelete