సాయంకాలమైంది పుస్తకం పై నా రివ్వూ

మనిషి తన జీవితాన్ని ఎంత గొప్పగా జీవించాలని ప్రణాళికలు వేసుకున్నా, తనకు జీవిత చరమాంకలో ఓ ఆలంబన అనుకున్న బంధాలు వేసే ఉచ్చులో పడక తప్పదు. తాను విధించుకున్న నియమాలను కడదాకా నిలపడం కోసం బిడ్డలను సైతం వదులుకున్న సుభద్రాచార్యులు కథే సాయంకాలమైంది. మరపురాని పాత్రలతో క్రి క్కిరిసిన సాయంకాలమైంది. గొల్లపూడి మారుతీరావు నాకు సినిమాలపరంగా మంచి నటులుగా తెలుసునే కానీ, ఆయనలోని రచయితను తొలిసారి “ సాయంకాలమైంది ” నవలలోనే పరిచయం చేసుకున్నాను. శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని పాటించడంలో తరాలు మారుతున్న కొద్ది వస్తున్న మార్పుని ఈ నవల్లో చూపించారు రచయిత. ఈ కథ నాలుగు తరాలను మనకు పరిచయం చేస్తుంది. పద్మనాభం అనే ఊరిలో ఆలయపూజారులైన సుభద్రాచార్యులవారి అంత్యక్రియలతో కథ ప్రారంభం అవుతుంది. ఆయన కొడుకు తిరుమల అమెరికా నుంచి తండ్రి అంత్యక్రియలకై ఊరికి వస్తాడు. కథ మొత్తం సుభద్రాచార్యులవారి చుట్టూ తిరుగుతుంది. కుంతీనాథాచార్యులు కొడుకు పెద్ద తిరుమలాచార్యులు, ఆయన కొడుకు సుభద్రాచార్యులది మూడవతరం. నాలుగవతరం వాడు చినతిరుమలాచార్యులు (తిరుమల). పూర్వీకులంతా వైష్ణవ సాంప్రదాయాన్నీ, ధర్మ జ్యోతిష తర్కశాస్త్రాల...