“ఏ నిముషానికి ఏమి జరుగునో” ఈ కాలం, ఈక్షణం అపురూపమైనవి. నిన్న ఇదే కాలంలో, నిన్న ఇదే క్షణంలో నేను ఎక్కడున్నాను అన్న ప్రశ్న వేధిస్తుంది నన్ను అస్తమానూ. ఆ క్షణంలో నేను ఉండే ప్రదేశాలు, కలిసే మనుషులు అన్నీ ఓ వింత అనుభూతిని మిగుల్చుతాయి. అలా ప్రతి మనిషీ ఓ అపరిచిత వాతావరణంలో గడిపే క్షణాలు రాకపోవు. అందులోని మనుషులు, పరిసరాలు అన్నీ నువ్వు ప్రస్తుతం నీదనుకుంటున్న ప్రపంచానికి కాస్త భిన్నమే, అయినా ఆ క్షణాలను ఆస్వాదించి, ఆ కొత్త ప్రపంచాన్ని ఆహ్వానించే మనసు నీకుండాలి. నువ్వు అనుకోని ఊహకందని వ్యక్తులను కలిసి వారితో గడిపినప్పుడు నీ ప్రపంచానికీ వారి ప్రపంచానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎత్తి చూపుతాయి. అప్పుడు నీకెంత పలుకుబడి ఉన్నా, సమాజంలో ఎంత పేరున్నా, నిన్నో సామాన్యుడిగా, సాటిమనిషిగా మాత్రమే చూసే క్షణాలు గొప్పవి. అవి నిన్ను నువ్వు తెలుసుకునే క్షణాలు.
“అతడు మనిషి” అద్దేపల్లి ప్రభు రాసిన ఈ కథ అదే చెపుతుంది. ఈయన రచనలు నేను ఇదే తొలిగా చదవడం. మామూలు శైలిలో చక్కగా సాగింది కథ.
ఒక కోట్:
“మనిషి సుఖంగా ఉన్నప్పుడు యాపారం చెయ్యచ్చు బాబూ..... కట్టంలో ఉన్నప్పుడు యాపారం చైకూడదు. రాత్రి మీరు కట్టంలో వచ్చారు. మీరు మడిసి..... నేను మడిసిని.... వానకి ముద్దైన పిట్ట చెట్టు మీద వాలబోతే చెట్టొద్దంటాదా.... ఇదీ అంతే... అలాంటి పరిస్థితిలో మడిసిని మడిసి సాయపడకపోతే ఇంకాణ్ణి మడిసనెలా అంటాం... ఇలాగే నాలాంటి మడిసి నీ ఇంటి ముంగిట నిలిస్తే లోనికి రమ్మంటావా.... బయటకు పొమ్మంటావా...?” ఈ కథలోని ఈ ఆఖరు మాటలు నన్ను కాసేపు వెంటాడాయి.