“దివాణంలో దొంగలు పడ్డారు”

ఎప్పటిలానే ఓ మామూలు సాయంత్రం వేళ కాకినాడ టూ కోటనందూరు బస్సు దిగి మట్టిరోడ్డు గుండా చేతిలో బట్టల సంచితో దివాణం వైపు నడుచుకొస్తుంది పార్వతి. చాకలి రేవు, రాములవారి గుడి పక్కనున్న రచ్చబండ దాటాకా, మట్టి వంతెన మీద నడుస్తుంటే ఉప్పుటేరులో ఎండాకాలం అంతగా నీటిమట్టం లేనప్పుడు తను, సరోజా గుజ్జన గూళ్ళు ఆడుకున్న రోజులు గుర్తుకొచ్చాయి. చీకటి పడటంతో ఆంజనేయస్వామి గుడి దగ్గర దీపాలు వెలుగుతున్నాయి. నిలువు చేతుల కుర్చీలో కాళ్ళు బార జాపుకుని కూర్చున్న ఎదురింటి రామం కళ్ళు మూసుకునే పెద్దగా విష్ణుసహస్రనామాలు చదువుతున్నాడు. మెట్లు ఎక్కుతున్న తనవైపు “ఈ వేళప్పుడు వచ్చావేమిటీ” అన్న ప్రశ్నను ముఖం మీద ముద్రగా వేసుకుని లోపలికెళుతున్న ఆమె వైపే కళ్ళు పెద్దవి చేసి చూస్తూండిపోయాడు. తన ఇంటికి ఎదురుగా ఉండే ఆ దివాణంలో జరిగే సంగతులు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కొన్నేళ్ళుగా రామానికి అలవాటుగా మారిపోయింది. తన రెండు కళ్ళకు కూతురు విశాలి కళ్ళు జోడించి “ఎవరా వచ్చేది” అంటూ నిత్యం ఆరాల పరంపర సాగిస్తాడు. నడుం లాగినపుడు గొలుసుల ఉయ్యాలపై పడుకుంటూ, మామూలు సమయాల్లో గుమ్మానికి పక్కగా వాల్చిన చేతుల వాలు కుర్చీలో కూర్చుని కాలాన్న...