Saturday, 17 January 2015

అనుభవాలు - జ్ఞాపకాలు చదివిన తర్వాత






 
చాలా రోజులుగా నాతో దగ్గరగా తన రహస్యాలు చెప్పుకున్న నేస్తం నిన్నటినుండీ నాతో మాట్లాడటంలేదు. ఉన్నట్టుండి ఏమైపోయాడో తెలీదు. తన గురించి సగమే చెప్పాడేమో, ఇంకా నేను తెలుసుకోవలసింది అసంపూర్ణంగా మిగిలిపోయిందని ఆఖరు పేజీ చదివాకనే తెలిసి, బాధ ఎక్కువైంది.

ఆయన జీవితం పువ్వుల బాటేం కాదు. జీవితంలో ఒకే లక్ష్యాన్ని పెట్టుకుని దానికోసమే బ్రతికి, ఎన్నో అవమానాలూ అనారణకు గురైన సందర్భాలు, కలలో కూడా మరపుకురానంతగా దీక్షబూని మరీ సాధించిన జ్ఞానం, ఏనుగంత ఎత్తు రచనలు చేయాలన్న తపన, దానిలోనే తనువు చాలించడం మహానుభావులకే సాధ్యం. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి ‘అనుభవాలు -జ్ఞాపకాలూను’ చదువుతున్నప్పుడు నాకు మొదట ఎంత త్వరగా ఈ పుస్తకం పూర్తి చేసి కొత్తది మొదలు పెడతానా అనిపించింది. కానీ వంద పేజీలు దాటాకా వారాల భోజనం, చదువుకోసం దూరాలు పోయి కొంతకాలం అక్కడే ఉండిపోవడం, తెలియని విద్యలతో పాటు మంచి నడవడికను, మర్యాదా మన్నలను తెలుసుకోవడంతోపాటు, విద్యకోసం ఆరోజుల్లో ఇంటిని, కన్నవారినీ విడిచి అంతంత దూరాలు వెళ్ళి చదువుకోవడం చూసాకా ఆనాటి పరిస్థితులగురించి రచయిత చెప్పాలనుకుంటుంది శ్రద్ధగా చదవాలని పట్టు వచ్చింది. ఆ పుస్తకం రాసేనాటికి ఆయనకు యాభైకి పైనే వయసు ఉంటుంది. అంత వయసులో కూడా తన చిన్ననాటి సంగతులన్నీ పూసగుచ్చినట్టు చెప్పడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది ఆయన ఆత్మకథ అనేకంటే, ఆయన రచనా వ్యాసంగానికి సంబంధించిన ఆత్మకథ అంటే బాగుంటుంది. తన కులవృత్తి పౌరోహిత్యాన్ని వదిలి, సంస్కృతాన్ని పక్కనపెట్టి తెలుగులో రచనలు చేయడానికి పడ్డ ఇబ్బందులను చెప్పుకొస్తున్నప్పుడు చాలా బాధ కలిగింది. నెమ్మదినెమ్మదిగా ఆయన నాకు ఓ స్నేహితుడైపోయాడు. రోజులు గడుస్తున్నకొద్దీ మా ఇద్దరి స్నేహం మరింత గట్టిపడింది. తన గురించి నాతో చెప్పే విధానం, ఆగొంతు నాకు చాలా దగ్గరగా అనిపించాయి. పుస్తకం ఇంకా వంద పేజీలు ఉందనగా నాకు బెంగ పట్టుకుంది. అయ్యో అప్పుడే అయిపోతుందే దీనికో పొడిగింపు ఉంటే బాగుండునుకదా అని. చివరికి దాచుకుదాచుకు చదివేసాను. ఆఖరు కొచ్చేసరికి అసంపూర్ణంగా మిగిలిపోయిన ఆయన జీవిత విశేషాలు తెలుసుకోలేకపోయినందుకు చాలా విచారం కలిగింది. పాఠకులే కాదు, ముఖ్యంగా ప్రతి రచయితా చదవవలసిన పుస్తకం అనుభవాలు-జ్ఞాపకాలూను.

ఇప్పటి రచయితకి తన కథను ప్రింటు వరకూ తీసుకువెళితేనే పాఠకునికి చేరుతుందని ఆలోచించనవసరం లేదు. దానికి చాలా సోషల్ మీడియా సహయం ఉంది. మనకు ఆయన పడ్డ పాట్లు పడనవసరమేలేదు. మంచికో చెడుకో.

నీలోకి ఒలికిపోయాననీ..

ఈరోజుకి రాసే ప్రేమలేఖ ఇది..  కొన్నిసార్లు అనిపిస్తుంది.  నేను నీలోకి ఒలికిపోయాననీ..  నీలోకి వచ్చి చేరాకా హృదయంలోని నిశ్శబ్దానికి...