అమరావతి కథల పై సమీక్ష
సత్యం శంకరమంచి "అమరావతి కథలు" పై నా సమీక్ష కినిగె పత్రికలో . “అల్లంత దూరాన మబ్బుల్ని తాకుతున్న గాలిగోపురం. ఆ వెనుక సూర్యకిరణాల పలకరింపుకు మెరుస్తున్న బంగారుపూత అమరేశ్వరాలయ శిఖరం. ఎత్తయిన ఆ శిఖరానికి చుట్టూతా ఎన్నో ఆలయాలు. ఎన్నెన్నో శిఖరాలు. తూర్పున వైకుంఠపురం కొండ, దక్షిణాన పాడుపడ్డ బౌద్ధ స్తూపాలు, పడమట ఈనాడు దిబ్బగా మారిన అల్లప్పటి శాతవాహనుల రాజధాని ధాన్యకటకం, ఉత్తరాన ఆ స్తూపాల్ని, ఆ దిబ్బల్ని వాటిమధ్య ఉండే ప్రజల్ని, ఆ ఊర్ని వడ్డాణంలా చుట్టి గల గల పారుతున్న కృష్టానది. అద్గదీ అమరావతి.” అమరావతి కథలు సత్యం శంకరమంచి రచించిన 100 కథల సంపుటి. సత్యంగారి రచనకు బాపూ గారి బొమ్మలు, ముళ్ళపూడి వెంకట రమణగారి ముందు మాట మరింత వన్నెతెచ్చాయి. ఈ కథల్లో తనకు పరిచయమున్న ఊరిని, ఊరివారినీ మనకు పరిచయం చేసారు. కథ నిడివి చిన్నదైనా కథ చెప్పిన తీరు, కథా విషయం నిరాడంబరంగా ఉంది. అమరావతి ఊరితో ఆయనకున్న అనుబంధం ప్రతీ కథలోనూ కనిపిస్తుంది. రాజులు, దొరలు, దొంగలూ, సామాన్య ప్రజలూ, అందరూ కథా పాత్రలే. ఒకింత హాస్యము, వ్యంగ్యమూ కలబోసి చెప్తారు. ప్రతీ కథా క్లుప్తంగా, సూటిగా, మనసుకు హత్తుకునే విధంగా ఉం...