మునెమ్మ ప్రతీకారం...

మునెమ్మ నవల 2008లో ప్రచురితమైంది. రచయిత డాక్టర్ కేశవరెడ్డి. కథా విషయం:– మునెమ్మ పల్లెటూరి పడుచు. జయరాముడు ఆమె భర్త. అతను మొరటుదనం, కరుకుదనం కలిగిన మనిషి. తనకు తోచింది తప్ప ఎవరి మాటా వినే రకం కాదు. మునెమ్మ అత్తవారింట కాపురానికి వచ్చిన రోజే పుట్టిన బొల్లిగిత్త అంటే ఆమెకూ, కుటుంబ సభ్యులకే కాదు, ఆ ఊరి వారందరికీ ఇష్టమే. వీధిలో పోతూ ఉంటే జయరాముణ్ణీ, బొల్లిగిత్తనూ రామలక్ష్మణులనేవారు. బొల్లిగిత్తను తమ బిడ్డగా భావించి మునెమ్మ జయరాములిద్దరూ తమ చేతి మీద దాని బొమ్మ పచ్చ పొడిపించుకుంటారు. ఆ బొల్లిగిత్త వారి జీవనాధారం కూడా. ఒకరోజు బొల్లిగిత్త మునెమ్మ మీదకు రెండు కాళ్లతో లేచి లైంగిక చేష్ట లాంటిది ప్రదర్శించటం చూసిన జయరాముడు రెచ్చిపోయి పారతో దాడి చేస్తాడు. చావబాదినా బొల్లిగిత్తపై కోపం తగ్గక దాన్ని సంత (పరస)లో అమ్మేసి కొత్త గిత్తను కొంటానని అక్కణ్ణించి ఆవేశంగా వెళిపోతాడు. ఈ సన్నివేశంతోనే కథ మొదలవుతుంది. ఈ కథ అంతట్నీ మనకు చెప్పేది జయరాముడి దూరపు చుట్టమైన సినబ్బ. జయరాముని తల్లి సాయమ్మ బొల్లిగిత్తను జయరాముడు చావబాదాడని మునెమ్మ ద్వారా తెలుసుకుంటుంది. ...