మనం కోల్పోయిన ప్రపంచాన్ని గుర్తు చేసే "బంగారు మురుగు"
శ్రీరమణ గారు రాసిన "బంగారు మురుగు" కథ చదివాకా, నా బాల్యం గుర్తుకు వచ్చింది. బామ్మ అందరికీ బాల్యపు తీపి గుర్తు. ఈ కథ చదువుతుంటే, మా బామ్మ కూడా ఇలానే ఉండేది అనో, ఇలాంటి బామ్మ నాకూ ఉంటే ఎంత బాగుండేది అనో అనుకోని వారు ఉండరు. ఇది అరవై ఏళ్ల బామ్మకూ, ఆరేళ్ల మనవడికీ మధ్య సాగే కథగా మాత్రమే గాక, మన మధ్య జరుగుతున్నదా అన్నట్టూ, ఆ కథలో మనమూ పాత్రలై ఉన్నామా అనిపించేట్టూ సాగుతుంది. గట్టి పిండంగా పేరు తెచ్చుకున్న బామ్మకు మనవడన్నా, తన చేతికున్న బంగారు మురుగు అన్నా, తాను పుట్టింటి నుంచి కాపురానికి వస్తూ తెచ్చుకున్న పెరటిలోని బాదం చెట్టన్నా ప్రాణసమానాలు. ఈ బాదం చెట్టే బామ్మా మనవళ్ల స్థావరం. ఇద్దరికీ రోజులో మూడు వంతులు అక్కడే కాలక్షేపం. బామ్మ తత్త్వం ఎవరికీ బోధపడదు. ఎదుటివారిని మాట్లాడనీయక, తన దైన వాగ్ధాటితో, ప్రేమావాత్సల్యంతో అబద్ధం చెప్పాలనుకున్న వారితో కూడా నిజం చెప్పించగలదు. కొడుకూ కోడలూ ఆస్తిని స్వామీజీలకు కైంకర్యం చేస్తూంటారు. బామ్మ మాత్రం వచ్చే పోయే స్వామిజీలను ఆటపట్టిస్తూంటుంది. ఒక స్వామీజీ దృష్టి బామ్మ బంగారు మురుగు మీద పడుతుంది. దాన్ని ఎలాగైనా తనకు దక్షిణగా దక్కించుకోవాలని ప్రయ...